బిఆరెస్ కు బిగ్ షాక్... పోచారం ఇంటికి సీఎం రేవంత్ ..కాంగ్రెస్ లోకి ఆహ్వానం

బిఆరెస్ కు బిగ్ షాక్... పోచారం ఇంటికి సీఎం రేవంత్ ..కాంగ్రెస్ లోకి ఆహ్వానం
  • మారనున్న రాజకీయ సమీకరణలు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బిఆరెస్ పార్టీలో కీలకమైన నేత,  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే నేత, మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం ఆ పార్టీ ని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు శుక్రవారం ఉదయం పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. వీరి భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కాంగ్రెస్లో చేరాలని పోచారంను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పోచారం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.  పోచారం కాంగ్రెస్ పార్టీలో చేరితే పెద్ద పదవి లభిస్తుందనే చర్చలు సాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.  కామారెడ్డి జిల్లాలో పోచారం నకు నాలుగు నియోజకవర్గాలపై పట్టు ఉంది. 

కాంగ్రెస్ నుంచే రాజకీయ అరంగేట్రం

1969 తెలంగాణ ఉద్యమం లో పాల్గొని జైలుకు వెళ్లిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంజనీరింగ్ విద్య ను  మద్య లో ఆపేసి 1977లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత టిడిపి లో చేరి దేశాయిపేట్ సొసైటీ చైర్మన్ గా, డీసీసీబీ చైర్మన్ గా, 1994లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రి గా పనిచేశారు. 1999లో ఎమ్మెల్యే గా గెలుపొంది మరోసారి మంత్రి గా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యే గా ఓడిపోయిన ఆయన 2009లో గెలుపొంది, టీడీపీ కి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆరెస్ లో చేరి 2011 ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యే గా గెలిచి తెలంగాణ రాష్ట్ర మొదటి వ్యవ5శాఖ మంత్రి గా పనిచేశారు. 2018లో గెలుపొందిన ఆయన అసెంబ్లీ స్పీకర్ గా 2023 వరకు పనిచేశారు. 2023లో ఎమ్మెల్యే గా మళ్లీ గెలుపొందారు.  పోచారం ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరితే మళ్ళీ మంత్రి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి.  ఇక్కడ కాంగ్రెస్ ఇంచార్జి గా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అయితే కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో మరింత బలపడుతుందనే సమీకరణ లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన పోచారం ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించడం గమనార్హం.