మూడో దఫా వచ్చాం.. మూడు రెట్లు ఎక్కువ కష్టపడి పనిచేస్తాం

మూడో దఫా వచ్చాం.. మూడు రెట్లు ఎక్కువ కష్టపడి పనిచేస్తాం
  • దేశ పౌరులకు ప్రధాని నరేంద్ర మోదీ హామీ

న్యూఢిల్లీ: మూడో దఫా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం మూడురెట్లు కష్టపడి మూడింతల ఫలితాలు సాధిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ పౌరులకు హామీ ఇచ్చారు. 18వ లోక్‌సభ తొలి సమావేశానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం (జూన్ 24) మీడియాతో మాట్లాడారు. "దేశ ప్రజలు మూడోసారి మాకు అవకాశం ఇచ్చారు. ఇది గొప్ప విజయం, మా బాధ్యత మూడు రెట్లు పెరిగింది..." అని ప్రధాని అన్నారు.

ఈ రోజును పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అద్బుతమైన రోజు అని పేర్కొన్న ప్రధాని మోదీ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కొత్త పార్లమెంట్ భవనంలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోందని అన్నారు. "ఇది పాత పార్లమెంటు భవనంలో జరిగేది. ఈ ముఖ్యమైన రోజున,  కొత్తగా ఎన్నికైన ఎంపీలందరికీ నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతాను, వారికి శుభాబినందలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని మోడీ అన్నారు. 

   ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) విజయం సాధించడం గురించి మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు కూడా చాలా ముఖ్యమైనవి ఎందుకంటే, స్వాతంత్ర్యం తర్వాత రెండవసారి ప్రజలు దేశంలోని ప్రభుత్వం వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశాన్ని కల్పించించారు" అని అన్నారు. దేశం బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటోందని ప్రధాని సూచించారు. ప్రజలకు కావాల్సింది సారాంశం, నినాదాలు కాదు, చర్చలు కావాలి అన్నారు.

    18వ లోక్‌సభ తొలి సెషన్‌ ప్రారంభం కాగా, కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతోంది. బుధవారం స్పీకర్ ఎన్నిక, నీట్-యూజీ, యూజీసీ-నెట్‌లో పేపర్ లీకేజీ ఆరోపణలపై చర్చలు, నియామకాలపై వాగ్వాదం వంటి వాటిపై విపక్షాలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నందున సెషన్ ఉధృతంగా ఉంటుందని భావిస్తున్నారు.