కాంగ్రెస్​ నేతల ఇళ్లపై ఈడీ సోదాలు

కాంగ్రెస్​ నేతల ఇళ్లపై ఈడీ సోదాలు
  • సీఎం కుమారుడికి నోటీసులు

జైపూర్​​: పేపర్​ లీక్​ కేసులో నిందితులైన రాజస్థాన్​లోని ప్రముఖ కాంగ్రెస్​ నేతల ఇళ్లపై ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) గురువారం దాడులు నిర్వహించింది. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసింది. పేపర్ల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చెందిన 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు.  రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 25వతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆకస్మికంగా సోదాలు జరపడం విశేషం. ఇప్పటికే పేపర్ల లీక్ కేసులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారా, మరో వ్యక్తి అనిల్ కుమార్ మీనాలను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక పక్క రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతుండగా మరో వైపు ఈడీ దాడుల పరంపర కొనసాగుతుండడాన్ని ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి తీవ్రంగా తప్పుపడుతోంది. నీతిమాలిన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని, కేంద్ర సంస్థలను ఉసిగొలిపి భయపెట్టే చర్యలకు దిగుతోందని ఆరోపిస్తోంది. మరోవైపు రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ కుమారుడు వైభవ్​ గెహ్లాట్​కు కూడా ఈడీ గురువారం సమన్తు జారీ చేసింది. ఫెమా చట్టం కింద విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ వైభవ్​ గెహ్లాట్​ విచారణకు హజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.