చక్కెర రైతులకు తీపి కబురు

చక్కెర రైతులకు తీపి కబురు
  • 28 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గింపు
  • ఆల్కహాల్​పై జీఎస్టీ అధికారం రాష్ట్రాలదే!
  • 52వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్​లో నిర్మలా సీతారామన్​ 


న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​చక్కెర రైతులకు తీపి కబురు చెప్పారు. శనివారం ఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్​లో నిర్వహించిన 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమె కీలక నిర్ణయాలు వెల్లడించారు. మొలాసిస్​పై 28 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఆల్కహాల్​పై కూడా పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ మండలి నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో చెరకు రైతులకు మేలు చేకూరనుంది. ఈ పరిణామం వల్ల పశువులకు అందే దాణా ధరల్లో కూడా తగ్గుదల నమోదు కానుంది.

70 శాతం తృణధాన్యాలు ఉన్న పిండిపై తగ్గిన జీఎస్టీ..

70 శాతం తృణధాన్యాలు ఉన్న పిండిపై జీఎస్టీని తగ్గించింది. పిండిని వదులుగా అమ్మితే పన్ను ఉండదని, అదే ప్యాకింగ్​ద్వారా అమ్మితే 5 శాతం జీఎస్టీ ఉంటుందని ప్రకటించింది. మొలాసిస్​పై జీఎస్టీ తగ్గించడంతో మిల్లర్ల వద్ద నుంచి రైతులకు బకాయిలు త్వరగా అందే వీలుందని మంత్రి పేర్కొంది. కార్పొరేట్​సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు అందించే గ్యారంటీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని, అయితే సంస్థ డైరెక్టర్​ పూచీకత్తు ఉంటే మాత్రం ఎలాంటి పన్ను విధించబోమని నిర్మలమ్మ పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం వాడే ఆల్కహాల్​పై జీఎస్టీ వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు. (జీఎస్​టీఎటీ) నేషనల్​బెంచ్​ఆఫ్​గూడ్స్​అండ్​సర్వీస్​టాక్స్​అప్పిలేట్​ట్రిబ్యునల్​అధ్యక్షుడు, సభ్యుల గరిష్ట వయస్సును ప్రస్తుతం ఉన్న 67 సంవత్సరాల నుంచి 70 ఏళ్లకు పెంచుతున్నట్లు నిర్ణయించామన్నారు. 

కాసినోలపై 28 శాతం జీఎస్టీ..

ఆన్​లైన్​గేమింగ్, కాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు నిర్మలా సీతారామన్​పేర్కొన్నారు. కాగా ఢిల్లీ, గోవాలు ఈ విషయాన్ని పున సమీక్షించాలని కోరాయని మంత్రి వెల్లడించారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా నీటి సరఫరా, ప్రజారోగ్యం, పారిశుధ్య సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రభుత్వ అధికారులకు సరఫరా చేయబడిన మురికివాడల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్ సేవలలో జీఎస్టీని మినహాయించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది. అయితే ఆయా సేవలను బట్టి నిర్ణయాలుంటాయని పేర్కొంది. భారతీయ రైల్వేలు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పొందేందుకు వీలుగా భారతీయ రైల్వేలు అందించే అన్ని వస్తువులు, సేవలపై ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను విధించాలని కౌన్సిల్ సిఫార్సు చేసింది. ఇది భారతీయ రైల్వేలకు ఖర్చును తగ్గిస్తుంది.