అంబానీ కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత

అంబానీ కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్  అధినేత ముకేశ్ అంబానీ  కుటుంబ సభ్యులకు దేశ, విదేశాల్లో జెడ్ ప్లస్  కేటగిరీ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ భద్రత కోసం అయ్యే ఖర్చులను వారే స్వంతంగా భరించాలని తెలిపింది.  యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ బికాశ్ సాహా కేసులో దాఖలైన మిసిలేనియస్ పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ముకేశ్ అంబానీకిగల ముప్పును తెలిపే నివేదికలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని త్రిపుర హైకోర్టు ఆదేశించడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు.

ముకేశ్ అంబానీకి, ఆయన కుటుంబ సభ్యులకు మన దేశంలోనూ, విదేశాల్లోనూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.  అంబానీలు మన దేశంలో ఉన్నపుడు మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించాలని తెలిపింది. వారు విదేశాలకు వెళ్లినపుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించాలని పేర్కొంది. ముప్పు ఉన్నపుడు, భద్రత కోసం అయ్యే ఖర్చులను వారే భరిస్తున్నపుడు ఫలానా ప్రాంతానికి, లేదా, ఫలానా చోటుకు పరిమితం చేయడం సరికాదని తెలిపింది. ఆ విధంగా పరిమితం చేయడం వల్ల వారికి భద్రత కల్పించడం వెనుకగల ఉద్దేశం దెబ్బతింటుందని పేర్కొంది. అంబానీల వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా వారికి భద్రతను పరిమితం చేయడం సరికాదని తెలిపింది.