బాల రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం

  • అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది

ముద్ర,సెంట్రల్ డెస్క్:- కోట్లాది మంది భారతీయుల శతాబ్దాల కల నెరవేరేందుకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది! రామ మందిర ప్రారంభోత్సవం కోసం చారిత్రక అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఓవైపు రామ నామ స్మరణ.. మరోవైపు పటిష్ఠ బందోబస్తు మధ్య.. అయోధ్యవాసులు.. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎదురుచూస్తున్నారు.

రామ మందిర ప్రారంభోత్సవం ఏర్పాట్లు పూర్తి

రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్యవాసులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది.ఇక.. మోదీ అయోధ్యకు వెళ్లిన తర్వాత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, సంప్రదాయాలు, ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం.. 7వేల మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసగిస్తారు ప్రధాని మోదీ.

పటిష్ఠ బందోబస్తు మధ్య ఈవెంట్​..

రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసేందుకు.. 7వేల మందికిపైగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్​. ఈ నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీ బందోస్తును ఏర్పాటు చేశారు అధికారులు. ఇప్పటికే.. చారిత్రక అయోధ్య నగరం.. భద్రతా వలయంలోకి జారుకుంది. నగరంలోని అనేక చోట్లు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు పోలీసులు. కెమికల్​, బయొలాజికల్​, రేడియోలాజికల్​, న్యూక్లియర్​ దాడులను అడ్డుకునే విధంగా శిక్షణ పొందిన అనేక ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు.. సోమవారం ఆలయం వద్ద భద్రతను పర్యవేక్షించనున్నాయి.