Umesh Pal Murder Case: ఉమేష్ పాల్ హత్య కేసులో  నిందితుల ఇళ్లను కూల్చేసిన  ప్రభుత్వం

Umesh Pal Murder Case: ఉమేష్ పాల్ హత్య కేసులో  నిందితుల ఇళ్లను కూల్చేసిన  ప్రభుత్వం
Umesh Pal Murder Case

సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తులను (ఇళ్లను) ప్రయాగ్‌రాజ్ పోలీసులు బుధవారం కూల్చివేశారు. దీని కోసం పోలీసులు బుల్‌డోజర్‌లను ఉపయోగించారు. 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన ప్రత్యక్ష సాక్షి ఉమేష్ పాల్ హత్యకు పాల్పడిన దుండగులను యూపీ పోలీసులు గుర్తించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఉమేష్ పాల్ ఫిబ్రవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆయనపై దుండగులు కాల్పులు జరపడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించాడు. ప్రయాగ్‌రాజ్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత దుండగులను గుర్తించారు. తదుపరి చర్యల కోసం ప్రధాన అనుమానితుల జాబితా, ఇతరుల వివరాలను సిద్ధం చేశారు. అయితే వారిపై చర్యలు తీసుకునేందుకు ఆ జాబితాను ప్రయాగ్‌రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీడీఏ)కి పంపించారు.

నిందితులకు చెందిన అనధికార, అక్రమంగా నిర్మించిన భవనాలు, నివాస భవనాల వివరాలను కూడా పీడీఏ అధికారులు సేకరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్,  జిల్లా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ప్రయాగ్‌రాజ్‌లోని నెహ్రూ పార్క్ సమీపంలో నిందితులను గుర్తించారు. ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులపై బుల్ డోజర్లను ప్రయోగించేందుకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే పీడీఏకు ఆమోదముద్ర వేసింది.  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ప్రభుత్వం నేరస్థులను, మాఫియాలను నిర్మూలిస్తుందని హెచ్చరించిన కొన్ని రోజుల తరువాత ఉమేష్ పాల్ సంచలన హత్యలో నిందితులలో ఒకరైన అర్బాజ్‌ను యూపీ పోలీసులు సోమవారం కాల్చి చంపారు.

కాగా.. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ పై ప్రాణాంతక దాడికి గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు నేతృత్వం వహించాడని గుర్తించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు రూ.50,000 రివార్డు ప్రకటించారు. అతిక్ అహ్మద్ కుమారుడితో పాటు మరో ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. అయితే పోలీసులు, ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీడీఏ) అధికారులు అతిక్ అహ్మద్, అతని ముఠాకు సన్నిహితంగా ఉన్న 20 మందిని గుర్తించారు. ప్రయాగ్ రాజ్ లోని తెలియార్ గంజ్, చాకియా, ధుమన్ గంజ్, సాలెంసరాయ్, హర్వారా, జయంతిపూర్, సదియాపూర్, మిండేరా, ఝల్వా, అటాలా ప్రాంతాల్లో నిందితుల ఆస్తులను గుర్తించారు. వారికి సంబంధించిన అక్రమ ఆస్తులను కూలగొట్టే ప్రక్రియను బుధవారం  ప్రారంభించారు.