ప్రేమికురాలి వద్ద రూ.68 లక్షల మోసం

ప్రేమికురాలి వద్ద రూ.68 లక్షల మోసం

చెన్నై: ప్రేమించిన యువతి వద్ద రూ.68 లక్షలను తీసుకుని మోసగించిన ఓ యువకుడు పోరూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం అందటంతో అగ్నిమాపక దళం సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు.  ఇక్కడి రాజా అన్నామలైపురం  ప్రాంతానికి చెందిన నిశాంత్‌ వడపళనికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇటీవల ఆ యువతి పూర్వీకుల ఆస్తిని విక్రయించింది. ఈ విషయం తెలుసుకున్న నిశాంత్‌ వ్యాపారంలో నష్టం జరిగిందని చెప్పి, ఆస్తిని అమ్మగా వచ్చిన నగదును తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతిని పెళ్ళి చేసుకోలేదు. ఇచ్చిన నగదును తిరిగి చెల్లించలేదు. అదే సమయంలో నిశాంత్‌కు మరో యువతితో పెళ్ళి కుదిరింది. ఈ నెల 3న ఆ వివాహం జరుగుతుందని తెలుసుకున్న నిశాంత్‌ ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు ఏ క్షణంలోనైనా తనను అరెస్టు చేస్తారనే భయంతో నిశాంత్‌ పరారయ్యాడు. ఆదివారం రాత్రి ఓఎమ్మార్‌లోని స్నేహితులతో మందుపార్టీలో పాల్గొన్నాడు. ఆ తర్వాత స్నేహితుడి కారును తీసుకుని పోరూరుకు బయలుదేరాడు.  పోరూరు చెరువు వద్ద కారును నిలిపిన నిశాంత్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోనున్నట్లు స్నేహితులకు వాట్సప్‌ సందేశం పంపాడు. దీంతో భీతిల్లిన అతడి స్నేహితులు ఆ చెరువుకు వద్దకు చేరుకున్నారు. నిశాంత్‌ తీసుకెళ్ళిన కారు మాత్రమే ఆ చెరువు గట్టు వద్ద కనిపించింది. నిశాంత్‌ ఏమయ్యాడో తెలియలేదు. వాట్సప్‌ సందేశం మేరకు పోలీసులు, అగ్నిమాపక దళం సభ్యులతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం వరకూ అగ్నిమాపక దళం సభ్యులు చెరువులో గాలించినా నిశాంత్‌ జాడ తెలియలేదు.