భారత్,  కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ ?

భారత్,  కెనడా విదేశాంగ మంత్రుల రహస్య భేటీ ?

 న్యూఢిల్లీ :  ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందనే కెనడా ఆరోపణలతో రెండు దేశాల మధ్య కొంత కాలంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాల విదేశాంగ మంత్రులు రహస్యంగా సమావేశమైనట్టు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్ వేదికగా రెండు రోజుల క్రితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ సమావేశమైనట్లు సమాచారం.  బ్రిటీష్ పత్రిక ఈ మేరకు ఓ కథనాన్ని పేర్కొంది. అయితే ఈ భేటీని ఇటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ, అటు కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖ కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. భారత్‌తో దౌత్యపరమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి కెనడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కూడా జరిగినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే మన దేశం డిమాండ్ చేసినట్లుగా ఢిల్లీలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకుంటున్నట్లు ఆ దేశం వెల్లడించింది.