పాలస్తీనాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన మలాలా

పాలస్తీనాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన మలాలా
  • యుద్ధం పిల్లలనూ వదలదన్న శాంతి బహుమతి గ్రహీత

న్యూఢిల్లీ : పాలస్తీనాలో కాల్పుల విరమణను తక్షణం అమలు చేయాలని మానవ హక్కుల, విద్యా కార్యకర్త మలాలా పిలుపునిచ్చారు. యుద్ధం పిల్లలను కూడా విడిచిపెట్టడదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు.  ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభం పల్ల పాకిస్తాన్ మానవ హక్కుల, విద్యా కార్యకర్త, 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుత యుద్ధంలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరుగుతుండం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా ఆమె తన చిన్నతనం నుంచి కళ్ల ముందు చూసిన అనుభవాన్ని వివరించారు. ‘‘ఇజ్రాయెల్ లోని వారి ఇళ్ల నుండి అపహరణకు గురైన వారినే కాదు.. వైమానిక దాడుల నుండి దాక్కున్న వారినే కాదు లేదా గాజాలో ఆహారం నీరు లేకుండా ఉన్న వారినే కాకుండా.. పిల్లలను కూడా ఏ యుద్ధం వదలిపెట్టదు.’’ అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.  పవిత్ర భూమిలో శాంతి, న్యాయం కోసం పరితపించే పిల్లలు, ప్రజలందరి కోసం తాను చింతిస్తున్నానని ఆమె పోస్టులో తెలిపారు. తన 11వ ఏట హింస, ఉగ్రవాదాన్ని చూశానని తెలిపారు. గత రోజుల విషాదకరమైన వార్తలను చూస్తున్నానని, అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో చిక్కుకున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు.