రైతులకు శుభవార్త.. 

రైతులకు శుభవార్త.. 
  • పీఎం కిసాన్ కింద అదనంగా మరో రూ.2 వేలు
  • ఈ కార్యక్రమం కోసం రూ 60 వేల కోట్లు కేటాయింపు  ? 

న్యూఢిల్లీ :  అన్నదాతలను ఆదుకోవాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు విడతలుగా రూ. 2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేల ఆర్థిక సాయం చేస్తోంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.8 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందే ప్రధాని మోడీ స్వయంగా దీనికి సంబంధించి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.  చిన్న రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని మూడింట ఒక వంతు పెంచే ప్రణాళికను కేంద్రం పరిశీలిస్తోందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార పార్టీ ఎన్నికలకు ముందే దీన్ని పెంచేందుకు కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఇదే గనక ఆమోదం పొందితే.. కేంద్ర ప్రభుత్వంపై రూ.20వేల కోట్ల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కార్యక్రమం కోసం రూ.60వేల కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.  పీఎం కిసాన్ నిధుల పెంపు విషయంపై స్పందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నాను భాసిన్ నిరాకరించారు. 

దేశంలోని 1.4బిలియన్ల జనాభాలో దాదాపు 65శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఇందులో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తుంటారు. వీరిని ఆకట్టుకునేందుకు పీఎం కిసాన్ పథకంలో అందించే మొత్తాన్ని పెంచే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎం కిసాన్ 15 విడత నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో 14 విడతలుగా రూ.28 వేలు జమ అయ్యాయి. ఇటు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకం కూడా అమలు చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ. 15 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పింది. అలాగే కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింప జేస్తాని స్పష్టం చేసింద. అలాగే మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు రూ.500 బోనస్ కూడా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.