రాహుల్ పై వేటు అనైతికం పార్లమెంట్​లో ఎంపీల నిరసన

రాహుల్ పై వేటు అనైతికం పార్లమెంట్​లో ఎంపీల నిరసన
  • నల్ల దుస్తులు ధరించి సమావేశాలకు
  • కాంగ్రెస్​తో కలిసి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్
  • సభను వాయిదా వేసిన స్పీకర్ ​
  • రాత్రి ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇంటిలో భేటీ

ముద్ర, ఢిల్లీ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు అనైతికమంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్షాల ఎంపీలు పార్లమెంటులో సోమవారం నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’ అంటూ నినాదాలు చేశారు. రాహుల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. ఈ నిరసనల నేపథ్యంలోనే లోక్‌సభ వాయిదా పడింది. రాహుల్ అనర్హత వేటుతో రాజకీయ పార్టీలు తమ రూటును మార్చుకున్నట్టు కనపడుతోంది. కాంగ్రెస్ తో కలవడానికి, ఆ పార్టీతో ఒకే వేదిక పంచుకోవడానికి నిన్నటి దాకా ఇష్టపడని త్రుణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులో  అన్ని పక్షాలు కలిసి నిరసనలకు దిగాయి.

విపక్షాల అర్జెంట్ మీట్
కాంగ్రెస్ కీలక​నేత రాహుల్ గాంధీ మీద​బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఇప్పటికే కాంగ్రెస్ యుద్ధం ప్రకటించింది. ఈ విషయంలో పలు విపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్​కు మద్దతునిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి కాంగ్రెస్​అధ్యక్షుడు మల్లిఖార్జున్​ఖర్గే తన ఇంటిలో కొందరు విపక్ష నేతలతో కీలక సమాలోచనలు జరిపారు. ఈ ఉన్నతస్థాయి సమావేశానికి కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్​గాంధీ, జయ్​రామ్​రమేశ్, అధీర్​రంజన్ చౌదరీ, కేసీ వేణుగోపాల్, ప్రమోద్ తివారీ, రజనీ పాటిల్​లాంటి పెద్ద నేతలు కూడా హాజరయ్యారు. డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, కేసీ, టీఎంసీ, ఆర్ఎస్పీ, ఆప్, జమ్మూ అండ్​కశ్మీర్​నేషనల్ కాంగ్రెస్​నేతలు సమాలోచనలలో పాలు పంచుకున్నారు. కె. కేశవరావు, రాంగోపాల్ యాదవ్​, ఎస్డీ హసన్​, శరద్​పవార్, సంజీవ్​ రంజన్​సింగ్​తదితర కీలక నేతలు ఈ భేటీకి వచ్చారు. అదానీ వ్యవహారంలో విచారణ జరిపేందుకు జేపీసీ వేసేలా బీజేపీపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలనే విషయంపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. రాహుల్​కు శిక్ష,​సభ్యత్వం రద్దు, ఇల్లు ఖాళీ చేయించేందుకు నోటీసుల అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాబోయే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారని సమాచారం.