నెతన్యాహూకు నిరసన సెగ

నెతన్యాహూకు నిరసన సెగ
  • ఇజ్రాయిల్ లో  ప్రజల ఆందోళన
  • రహదారుల మీద భారీగా ప్రదర్శన
  • రక్షణ మంత్రి తొలగింపునకు నిరసన
  • ప్రధాని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ
  • రంగంలోకి దిగిన పోలీసు, ఆర్మీ బలగాలు

న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ ప్రధానమంత్రి​బెంజిమన్‌ నెతన్యాహూకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు సోమవారం రహదారుల మీద చేరి భారీ ప్రదర్శన చేపట్టారు. రక్షణ శాఖ మంత్రి యోవ్​గాలంట్ ను పదవి నుంచి తొలగిస్తూ  నెతన్యాహూ ఆదివారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశమే ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రధానమంత్రి ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం విలువనీయడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. యెరుసలెంలోని నెతన్యాహూ ఇంటివద్ద భారీగా ఆందోళనకారులు చేరి నిరసనలకు దిగారు. ఆందోళన నేపథ్యంలో పోలీసు, ఆర్మీ బలగాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులపై వాటర్​కెనన్లను ప్రయోగించాయి. ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా  స్థానిక అవివ్​నగరంలో ఉన్న గురియన్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను రాకపోకలను నిలిపివేసింది.

తొలగింపు ఎందుకు?
ఇజ్రాయిల్‌ న్యాయవ్యవస్థను తన గుప్పిటలో ఉంచుకునేందుకు వీలుగా నెతన్యాహూ తీసుకువస్తున్న సవరణలను వెంటనే నిలిపివేయాలని రక్షణ మంత్రి శనివారం డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్‌ భద్రత ప్రమాదంలో ఉందని కూడా ఆయన ఆరోపించారు. సవరణల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మీడియా ముఖంగా కోరారు. దీంతో రక్షణ మంత్రిని కేబినెట్ నుంచి తొలగిస్తూ ప్రకటన వెలువడింది. వెనువెంటనే అమెరికాలోని ఇజ్రాయిల్‌ కాన్సుల్‌ జనరల్‌ అసఫ్‌ జమీర్‌ రాజీనామా చేశారు. ఇకపై తాను ఈ ప్రభుత్వంలో కొనసాగలేనని ఆ తరువాత విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మరోవైపు జాతీయ భద్రత అణిచవేతలో భాగస్వాములు కాకూడదని నెతన్యాహూకి చెందిన లికుడ్‌ పార్టీ సభ్యులకు ప్రతిపక్ష పార్టీ నేతలు బెన్నీ గాంట్జ్‌, యైర్‌ లాపిడ్‌లు విజ్ఞప్తి చేశారు. రాజకీయ జూదంలో జాతీయ భద్రతను పణంగా పెట్టవద్దని అభ్యర్థించారు. నెతన్యాహూ అన్ని హద్దులను దాటారని ధ్వజమెత్తారు. నెతన్యాహూకు చెందిన లికుడ్‌ పార్టీ సభ్యులు కూడా ఈ ప్రతిపాదనను విమర్శిస్తున్నారు. నెతన్యాహూ ప్రవేశపెడుతున్న సవరణలకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.