డబ్బా ట్రేడింగ్​తో టర్నోవర్​ రూ. 4672 కోట్లు!

డబ్బా ట్రేడింగ్​తో టర్నోవర్​ రూ. 4672 కోట్లు!
  • రూ. 2 కోట్ల టాక్స్​ఎగ్గొట్టిన వ్యక్తి అరెస్ట్​

ముంబై: స్టాక్ మార్కెట్లలో మరో అక్రమ రాకెట్ బయటపడింది. అధికారుల కళ్లు గప్పి డబ్బా ట్రేడింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. మూడు నెలల వ్యవధిలోనే ఆ వ్యక్తి టర్నోవర్ రూ.4672 కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా పన్నుల రూపంలోనే రూ. 2 కోట్ల వరకు ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. డబ్బా ట్రేడింగ్ అనేది.. అధికారిక స్టాక్ ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫాంలో కాకుండా బయట అక్రమంగా జరిపే షేర్ల ట్రేడింగ్ అన్నమాట. అంటే ఇక్కడ ఫేక్ స్టాక్ మార్కెట్‌నే సృష్టించాడన్నమాట. ఇది ఒక జూదం లాంటిది. దీనిని భారత్‌లో నిషేధించారు. అయినా అక్కడక్కడ అధికారుల కళ్లు గప్పి ఇలాంటివి చేసే వారు చాలా మందే ఉంటారు. నిందితుడిని జతిన్ సురేశ్‌భాయ్ మెహ్తాగా గుర్తించారు. ముంబయి సబర్బన్‌లోని కండివలీ నుంచి రోజే అతడిని కస్టడీలోకి తీసుకున్నారు.

మెహ్తా ఇలా అక్రమంగా పెద్ద మొత్తంలో సంపాదించడంతో పాటు.. ఎన్నో రకాల పన్నులను ఎగ్గొట్టాడని అధికారులు గుర్తించారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్, స్టేట్ గవర్న్‌మెంట్ స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, సెబీ టర్నోవర్ ఫీజులు, స్టాక్ ఎక్స్చేంజ్ టర్నోవర్ రెవెన్యూ ఇలా అన్నీ కలుపుకొని రూ.1.95 కోట్ల వరకు కట్టకుండా ప్రభుత్వానికి నష్టాలను మిగిల్చినట్లు గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండానే స్టాక్ ఎక్స్చేంజీ వెలుపల అనధికారిక షేర్ ట్రేడింగ్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 2023 మార్చి 23 నుంచి జూన్ 20 వరకు మెహ్తా టర్నోవర్ రూ.4672 కోట్లు అని తెలిపారు పోలీస్ అధికారులు. పక్కా సమాచారంతో ముంబయి క్రైం బ్రాంచ్ టీం సహా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎస్​ఎస్​ఈ అధికారులు, మల్టీ కమొడిటీ ఎక్స్చేంజీ ఎంసీఎక్స్​అధికారులు మహవీర్ నగర్‌లోని షేర్ బ్రోకర్ ఆఫీస్‌పై సోదాలు చేశారు. అక్కడ రూ. 50 వేల నగదును సీజ్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టాబ్లెట్, పేపర్ ష్రెడ్డర్, పెన్ డ్రైవ్ సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.