గెలిస్తే 16 లక్షల మందికి ఉద్వాసన

గెలిస్తే 16 లక్షల మందికి ఉద్వాసన
  • వివేక్​రామస్వామి సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్: వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి పోటీ పడుతున్నారు. ఇందులో భాగంగా ప్రైమరీ డిబేట్లలో పాల్గొంటున్న వివేక్ రామస్వామి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు అమెరికాలో పెను సంచలనంగా మారాయి. ఎందుకంటే ఒకవేళ తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే అమెరికాలోని ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 16 లక్షల మందిని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతానని ప్రకటించారు. దీంతోపాటు చాలా ప్రభుత్వ సంస్థలను మూసివేస్తానని వివేక్‌ రామస్వామి వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. రిపబ్లికన్‌ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్‌ రామస్వామి తాజాగా కీలక ప్రతిపాదనలు చేశారు. అమెరికాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో 75 శాతం మందిని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలగిస్తానని ఓ అమెరికన్‌ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే ఈ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వీటితోపాటు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్‌, టొబాకో, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అణు నియంత్రణ కమిషన్‌, ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసెస్‌ - ఐఆర్‌ఎస్‌, కామర్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ సహా వివిధ విభాగాల్లో సంస్కరణలు తీసుకువస్తానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. కాగా వివేక్​రామస్వామి వ్యాఖ్యలపై ఇటు ఉద్యోగులే కాకుండా, అటు అమెరికన్లు కూడా భగ్గుమంటున్నారు.