మీడియా స్వేచ్ఛను హరించే యత్నం

మీడియా స్వేచ్ఛను హరించే యత్నం

సుప్రీం సిజెఐకి ఐ జే యూతో సహా 18 మీడియా సంస్థల లేఖ

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని, మీడియా స్వేచ్ఛపై దాడులు… పీకనొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కు 18 మీడియా సంస్థలు లేఖ రాశాయి. మీడియా సంస్థలు సుప్రీం తలుపు తట్టడం అరుదైన విషయం. న్యూస్ క్లిక్ పై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాపితంగా జర్నలిస్ట్ సంఘాలు, మేధావులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు , కవులు ,కళాకారులూ రోడ్డెక్కారు. కేంద్రం తీరుకు దేశవ్యాపితంగా నిరసన పెల్లుబికింది. ఇంతటి నిరసన వస్తుందని బహుశా ప్రభుత్వం కూడా ఉహించి ఉండదు .. నిరసనల్లో మాజీ హైకోర్టు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు, ప్రముఖ జర్నలిస్టులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ సంఘీభావం తెలపడం విశేషం. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు రాసిన లేఖలో పేర్కొన్నాయి.

తమపై ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో దేశంలోని చాలా మంది జర్నలిస్టులు భయంతో పని చేస్తున్నారని లేఖలో వారు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని… సోదాల పేరిట వారిని కట్టడి చేసేందుకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కూడా కోరుకోవడం లేదని… కానీ, పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. జర్నలిస్టులు నిజాలు మాట్లాడినప్పుడే పత్రికా స్వేచ్ఛ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ లో పని చేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐకి మీడియా సంస్థలు లేఖ రాశాయి.