గూడ్స్​ రైళ్ళు ఢీ

గూడ్స్​ రైళ్ళు ఢీ
  • పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు
  • సిగ్నలింగ్​ లోపంపై విచారణ

కోల్​కత్తా: రెండు గూడ్సు రైళ్లు ఢీకొట్టిన ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు వండా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్సు రైలును.. మరో రైలు వెనక నుంచి వచ్చింది ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ గూడ్సు లోకో పైలట్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గూడ్సు రైళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, మెయిన్‌ లైన్‌లో వెళ్తోన్న గూడ్సు.. లూప్ ‌లైన్‌లోకి వెళ్లి అక్కడ ఆగి ఉన్న మరో రైలును ఢీకొట్టడం గమనార్హం. రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ చేపట్టారు. 

‘ప్రాథమిక సమాచారం ప్రకారం వండా రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓ గూడ్సు రైలును మరో గూడ్సును ఢీకొట్టింది.. ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణలో వెల్లడవుతుంది.. పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తాం’ అని వండా స్టేషన్ సేఫ్టీ ఆఫీసర్ దివాకర్ మాంఝీ అన్నారు. రెండు గూడ్సు రైళ్లు ఢీకొట్టిన సమయంలో అటుగా మరో ప్యాసింజర్ రైలు ఏదీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే మరో బాలాసోర్‌ దుర్ఘటనను తలపించేంది. తాజాగా, ప్రమాదంతో అడ్రా డివిజన్‌ పరిధిలోని రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఖరగ్‌పూర్-బంకురా-ఆండ్రా మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పట్టాలు తప్పిన బోగీలను పక్కకు తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కాగా, జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది మిగిలిపోయింది.