అది వారి అంతర్గత వ్యవహారం 

అది వారి అంతర్గత వ్యవహారం 
  • ఇరాన్ -పాక్ పరస్పర దాడులపై ... 
  • విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైస్వాల్

న్యూఢిల్లీ :  పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఉన్న మిలిటెంట్ స్థావరాలపై ఇరాన్ డ్రోన్, క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘జైష్ అల్ అదిల్’ అనే మిలిటెండ్ గ్రూప్‌కి చెందిన రెండు స్థావరాలపై దాడి చేసింది. ఈ దాడులపై భారత్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా పాక్, ఇరాన్‌ల అంతర్గత వ్యవహారమని తెలిపింది. ఉగ్రవాదాన్ని భారత్ ఏమాత్రం సహించబోదని తేల్చి చెప్పిన విదేశాంగ కార్యదర్శి రణ్‌ధీర్ జైస్వాల్.. ఆత్మరక్షణలో భాగంగా కొన్ని దేశాలు తీసుకున్న చర్యలను అర్థం చేసుకోగలమని అన్నారు.  అటు.. పాకిస్తాన్ కూడా ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ దాడుల్ని తీవ్రంగా పరిగణించిన పాక్.. ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించినట్లుగానే క్షిపణి దాడులకు తెగబడింది. అయితే.. ఇరాన్‌లోని ఏడు ప్రాంతాల్లో బలూచ్ ఏర్పాటువాద సంస్థలకు చెందిన శిక్షణా శిబిరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపింది. అటు.. ఇరాన్ చేసిన దాడులకు నిరసనగా ఇరాన్ దౌత్యవేత్తకు పాక్ సమన్లు జారీ చేసింది. మిలిటెంట్ల అక్రమ కార్యకలాపాలపై తమతో సంప్రదించేందుకు ఎన్నో మార్గాలు ఉండగా.. వాటిని కాదని ఇలా దాడులను ఎంచుకోవడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది.