దద్దరిల్లిన పార్లమెంట్​ ఉభయ సభలు వాయిదా

దద్దరిల్లిన పార్లమెంట్​ ఉభయ సభలు వాయిదా
  • కుదిపేసిన మణిపూర్ అంశం
  • తక్షణ చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
  • మహిళల నగ్న ఊరేగింపుపై ఆగ్రహం
  • శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపణ
  • కేంద్ర ప్రభుత్వం చేతకానితనమేనని విమర్శ 
  • సభలో చర్చకు అనుమతివ్వాలని కోరిన సోనియా
  • నినాదాలతో హోరెత్తిన ఉభయ సభలు
  • పలుమార్లు వాయిదా వేసిన స్పీకర్, చైర్మన్​
  • మణిపూర్ ఘటన తనను కలిచివేసిందన్న ప్రధాని మోడీ

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఉరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన ఎవ్వరినీ వదలబోమని  దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. మణిపూర్‌ దురాగతాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇది దేశమంతా సిగ్గుతో తలదించుకునేలా చేసిన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగితే సహించబోమని హెచ్చరించారు. పార్లమెంటు సమావేశాలకు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు మణిపూర్ ఘటనపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

ముద్ర, తెలంగాణ బ్యూరో: వర్షాకాల సమావేశాలు మొదలైన రోజే పార్లమెంటు ఉభయసభలు అట్టుడికిపోయాయి. ప్రారంభమైన కొద్ది గంటలకే వాయిదా పడ్డాయి. మణిపూర్ అంశం ఉభయ సభలను కుదిపేసింది. ఆ రాష్ట్రంలో అల్లర్లు, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశం మీద కేంద్రం స్పందించాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. రెండుసార్లు వాయిదా వేసినప్పటికీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ఉభయ సభలను శుక్రవారానికి వాయిదా వేసారు. గురువారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో చైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఇటీవల మృతిచెందిన సభ్యులు, మాజీ ఎంపీలకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ వెంటనే మణిపూర్​ అంశంపై చర్చించాలంటూ సభ్యులు నినాదాలు చేయడంతో లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్ వెలుపల కూడా మణిపూర్ ఘటనపై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. 

ప్రధాని మోడీ ఆగ్రహం
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని, బాధించిందని, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండి పోయాయని చెప్పారు. ఏ నాగరికత కైనా ఈ సంఘటన సిగ్గు చేటని,  దేశానికి అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌ లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా శిక్ష నుంచి తప్పించుకో కూడదన్నారు. నిందితులను వదిలి పెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైన వారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ వాయిదా పడిన అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి మాట్లాడుతూ మణిపూర్​అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలు ప్రారంభమైన తర్వాత దీనిపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్​ షా పూర్తి వివరణ ఇస్తారని, ఈ చర్చకు సంబంధించిన సమయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారని వెల్లడించారు. రాజ్యసభా పక్ష నేత పీయూష్‌ గోయల్‌ విపక్షాల తీరుపై మండిపడ్డారు. వారి ప్రవర్తన చూస్తుంటే సభ సజావుగా నడవకూడదమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. మణిపూర్‌ సంఘటనలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలు సభా కార్య కలాపాలను అడ్డుకున్నాయని అన్నారు.

సోనియాజీ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?  
సభ ప్రారంభానికి ముందు కాంగ్రెస్‌ నేత సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోడీ పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మణిపూర్‌ అంశంపై చర్చించాలని మోడీకి సోనియా విజ్ఞప్తి చేసినట్లు లోక్‌సభలో ఆ పార్టీ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి వెల్లడించారు. ఇటీవల సోనియా, రాహుల్‌ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కావడాన్ని ప్రస్తావించిన మోడీ అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 

ప్రధాని మోడీ మౌనం వీడాలి
మణిపూర్ దారుణాలు, హింసాకాండపై ప్రధాని మోడీ మౌనం వీడి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకుడు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గురువారం లోక్ సభలో మణిపూర్ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన నామ ఈ అంశంపై చర్చించాలని పార్టీ ఎంపీలతో కలసి  పట్టుబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడం అవమానవీయ ఘటన అన్నారు. సభ్య సమాజానికి సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వ చేతగానితనం వల్లనే మణిపూర్ రావణకాష్ఠంలా మండుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయని, ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు. వేలాది మంది ఇళ్లను వదిలి, సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్నారని అన్నారు. వందలాది మంది చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని  నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. 

సభ వాయిదాపై  మండిపాటు
సభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని ముందే బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మాణం ఇచ్చినా చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం సభను కావాలనే శుక్రవారానికి వాయిదా వేసి, తప్పించుకుందని నామ నాగేశ్వరరావు మండిపడ్డారు.  సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం  పార్టీ ఎంపిలతో కలిసి మణిపూర్ అంశంపై సభను స్తంభింపజేశారు. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబడుతూపెద్ద పెట్టున  నినాదాలు చేశారు. ప్రభుత్వం తప్పించుకుందని నామ నాగేశ్వరరావు మండిపడ్డారు.