బెంగాల్‌లో డెంగ్యూ విజృంభణ .. 38 వేల  కేసులు నమోదు

 బెంగాల్‌లో డెంగ్యూ విజృంభణ .. 38 వేల  కేసులు నమోదు

కోల్కత్తా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో డెంగ్యూ కలవరపెడుతోంది. ఈ సీజన్ లో ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ సీజన్ లో సెప్టెంబర్ 20వ తేదీ వరకు దాదాపు 38 వేల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కోల్ కతా సహా దక్షిణ ప్రాంతంలోని జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. ఉత్తర 24 పరగణాలు జిల్లా అత్యధికంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఏకంగా 8,535 కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా లో 4,427 కేసులు నమోదు అయ్యాయి. ముర్షిదాబాద్ లో 4,266 కేసులు, నదియాలో 4,233 కేసులు, హుగ్లీలో 3,083 కేసులు నమోదు అయినట్లు అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉత్తర 24 పరగణాలు, ముర్షిదాబాద్, నదియా లో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ డెంగ్యూ ప్రభావిత ప్రాంంతాలు బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటాయి. మరో సరిహద్దు జిల్లా దక్షిణ 24 పరిగణాల్లో 1,276 కేసులు నమోదు అయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ డేటా ప్రకారం, పశ్చిమ బెంగాల్ గత ఏడాది దేశంలో అత్యధిక డెంగ్యూ కేసులు 67,271 నమోదైన రాష్ట్రంగా నిలిచింది. డెంగ్యూ వల్ల కనీసం 30 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.  రాష్ట్రంలో సెప్టెంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు సుమారు 7  వేల డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. దక్షిణ బెంగాల్ లోని 15 జిల్లాల్లో 34,905 కేసులు వెలుగు చూశాయి. ఉత్తర బెంగాల్ లోని 8 జిల్లాలు, డార్జిలింగ్, కాలింపాంగ్ హిల్స్ తో సహా దాదాపు 3,276 కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.