రాంగ్​సైడ్​లో కారును ఢీకొన్న బస్సు

రాంగ్​సైడ్​లో కారును ఢీకొన్న బస్సు
  • ఆరుగురు మృతి.. ఇద్దరికి గాయాలు
  • యూపీ సీఎం సంతాపం

ఘజియాబాద్​: ఢిల్లీ–మీరట్​ఎక్స్​ప్రెస్​వే ఘజియాబాద్​లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. విజయ్​చౌక్​వద్ద ఓ పాఠశాల బస్సు టీయూవీ–300 అనే కారును అతివేగంగా వస్తూ ఢీకొట్టింది. బలంగా కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు కారులోని వారిని వెలికి తీసేందుకు భారీ కట్టర్లు వాడాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్​సోషల్​ మీడియాలో ప్రత్యక్షమయింది. మీరట్​కు చెందిన కుటుంబం కారులో రాజస్థాన్​లోని ఓ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు వెళుతుండగా రాంగ్​సైడ్​లో వస్తున్న బస్సు ఢీకొంది. ఈ బస్సు 8 కిలోమీటర్ల దూరం నుండి హైవేపై రాంగ్​సైడ్​లోనే వస్తోందని పోలీసులు గుర్తించారు. స్కూలు బస్సు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్​ డీసీపీ రామానంద్ తెలిపారు. ప్రమాద సమయంలో పాఠశాల బస్సులో విద్యార్థులు ఎవరూ లేరన్నారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని డీసీపీ తెలిపారు. కాగా 8 కిలోమీటర్లు ఎక్స్​ప్రెస్ హైవేపై రాంగ్​సైడ్​లో అంతపెద్ద బస్సు వెళుతుండగా పోలీసుల దృష్టికి ఎందుకు రాలేదని దాన్ని ఎందుకు అడ్డుకోలేదని మీడియా ప్రశ్నించగా డీసీపీ నీళ్లు నమిలారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేగాక గాయపడ్డవారికి మెరుగైన వైద్యచికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.