ఉద్యోగ ఖాళీల భర్తీ

ఉద్యోగ ఖాళీల భర్తీ
  • ఎన్నికల ర్యాలీలో కమల్ నాథ్
  • మహిళలకు రక్షణ కరువు – ప్రియాంకాగాంధీ వాద్రా

మధ్యప్రదేశ్​: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాక్ లాగ్ ఖాళీల భర్తీకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కమల్ నాథ్ అన్నారు. ఖాళీల భర్తీ ద్వారా నిరుద్యోగితను రూపుమాపడానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని మాండ్లాలో గురువారం ఆయన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. అయిదేళ్ల పాలనలో మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యువతకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. యువతకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతిని మాత్రమే అందించిందని ఆయన విమర్శించారు. అదే ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తన ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్దారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దేశంలో అత్యధికంగా బాలికలు అదృశ్యమైన రాష్ట్రం మధ్యప్రదేశ్ అని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో 1.5 లక్షల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో రోజుకు 17 మానభంగం కేసులు నమోదవుతున్నాయని ఆమె ఆరోపించారు. దేశంలోనే గిరిజనులపై అత్యధికంగా అకృత్యాలు జరుగుతున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

 
పితృపక్షాల తర్వాతే అభ్యర్థుల ప్రకటన – కమల్ నాథ్

మహాలయ పితృపక్షాలు ముగిసిన తర్వాతే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత కమల్ నాథ్ స్పష్టం చేశారు. ఇదిలావుంటే, మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 స్థానాలకు గాను 136 సీట్లకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. ఈ రాష్ట్రంలో నవంబరు 17న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలను ప్రకటిస్తారు.