రెజ్లర్ల అరెస్ట్

రెజ్లర్ల అరెస్ట్
  • పార్లమెంట్​భవన్​ముట్టడికి క్రీడాకారుల యత్నం
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • జంతర్​మంతర్​వద్ద టెంట్ల తొలగింపు
  • పోలీసుల చర్య శోచనీయమన్న ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్​భూషణ్​ను వెంటనే అరెస్టు చేసి, తమ డిమాండ్లను పరిష్కరించాలని జంతర్​మంతర్​వద్ద ధర్నా నిర్వహిస్తున్న రెజ్లర్లను పోలీసులు అరెస్ట్​చేశారు. ఆదివారం రెజ్లర్లంతా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నూతన పార్లమెంట్ భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పక్కకు తప్పించి రెజ్లర్లు దూసుకొస్తుండగా గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రెజ్లర్లు రోడ్డుపైనే బైఠాయించి బ్రిజ్​భూషణ్​ను వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. పలుమార్లు పోలీసులు వారించినా వినకపోడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. రెజ్లర్లు తమ అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించడంతో పెనుగులాటలు చోటుచేసుకుంది. రెజ్లర్లను అరెస్టు చేయడంతోపాటు ధర్నా కోసం జంతర్​మంతర్ వద్ద రోడ్డుపై వారు వేసుకున్న టెంట్లను కూడా పోలీసులు తొలగించారు. అక్కడ రెజ్లర్లు ఏర్పాటు చేసుకున్న సామగ్రినంతా తీసేశారు. భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్​తో సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులు మీడియాతో మాట్లాడుతూ.. తాము శాంతియుతంగా నూతన పార్లమెంట్ భవనం వైపు వెళ్లి తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినబడేలా చేద్దామని అనుకుంటే పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. తమను దేశద్రోహులుగా చిత్రీకరించేలా చూస్తున్నారని విమర్శించారు. 

ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదు..
రెజ్లర్ల అరెస్ట్ పై ఏఐసీసీ సీనియర్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన రెజ్లర్లపై ఉక్కుపాదం మోపడం శోచనీయమన్నారు. సముచిత గౌరవం దక్కాల్సిన మహిళా క్రీడాకారులను సైతం బీజేపీ ప్రభుత్వం అణగదొక్కడం శ్రేయస్కరం కాదన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా హర్యానా నుంచి ముందుగానే నిరసన తెలిపేందుకు భారీ ఎత్తున రెజ్లర్లు క్రీడాకారులను రప్పించుకున్నారు. దీంతో అలర్టయిన ఢిల్లీ పోలీసులు భారీ ఎత్తున మహిళా పోలీసులను కూడా సిద్ధం చేశారు. హర్యానా నుంచి వచ్చిన క్రీడాకారులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆయా హోటళ్లు, లాడ్జీల వద్ద ముందే నిఘా వేసి ఉంచారు. నిరసన సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను అవుటర్ నార్త్ డీసీపీ డిప్యూటీ కమిషనర్​కు రెండు రోజుల ముందే లేఖ రూపంలో తెలిపారు. క్రీడాకారుల నిరసన, నూతన పార్లమెంట్ భవన్​ ప్రారంభం సందర్భంగా అప్రమత్తమై భారీ ఎత్తున క్రీడాకారులను అక్కడే దిగ్బంధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. అనుకున్నట్లుగానే రెజ్లర్లు నూతన పార్లమెంట్ భవనం వైపు ఒక్కసారిగా పరుగులు తీయడంలో అప్పటికే సిద్ధంగా ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.