భారత్​లో హింస పెరిగింది

భారత్​లో హింస పెరిగింది
  • ప్రస్తుతం గాంధీ, గాడ్సేల మధ్య పోరాటం జరుగుతోంది
  • ఇండియా కూటమి అంటే బీజేపీకి భయం
  • యూరప్​లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ

బ్రస్సెల్: దేశ ప్రజల వాక్కును బీజేపీ అణిచివేయాలని చూస్తోందని, ప్రస్తుతం ఇండియాలో గాంధీ, గాడ్సేల మధ్య పోరాటం జరుగుతోన్నట్లు పరిస్థితులు ఉన్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్​గాంధీ ఆరోపించారు. భారత్​లో ప్రజాస్వామ్యంపై దాడులు పెచ్చుమీరాయని పేర్కొన్నారు. శుక్రవారం యూరప్ లోని బ్రస్సెల్​ప్రెస్​క్లబ్​లో రాహుల్​మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో హింస, వివక్ష పెరిగిందన్నారు. అదే సమయంలో మైనార్టీలు, దళితులు, ఆదివాసీలు, అట్టడుగువర్గాలపై దాడులు పెచ్చుమీరాయన్నారు. 

ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసే కుట్ర..

విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పర్చుకుంటే ఆ కూటమిని విచ్ఛిన్నం చేసే చర్యలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా పేరును కాస్త భారత్​గా మార్చాలని కుటీల యత్నాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. దేశం దృష్టిని అదానీపై నుంచి మళ్లించేందుకే ఇలా చేశారని ఆరోపించారు. భారతదేశంలో పేదలు ఇంకా పేదరికంలోకి వెళుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, దేశాభివృద్ధిపై నిక్కచ్చిగా మాట్లాడుతుందనే జి–20 సమావేశాలకు కాంగ్రెస్​ను పిలవలేదన్నారు. దేశంలోని 60 శాతంమంది ప్రజలకు నాయకత్వం వహిస్తున్నవారికే ప్రాముఖ్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇది బీజేపీ ఆలోచనలకు అద్దం పడుతోందన్నారు. అదే సమయంలో జి–20కి అధ్యక్ష బాధ్యతలు భారత్​పొందడం శుభపరిణామంగా అభివర్ణించారు. రష్యా–ఉక్రెయిన్​యుద్ధంపై దేశ వైఖరికి తాము మద్దతు తెలుపుతున్నామన్నారు. రష్యాతో భారత్​కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. కాగా గురువారం రాత్రి యూరోపియన్​ యూనియన్ ఎంపీలతో రాహుల్​గాంధీ భేటీ అయ్యారు.