Working Journalists Act వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలి

Working Journalists Act వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను పునరుద్ధరించాలి

చండీగఢ్ మీడియా మీట్ డిమాండ్

చండీగఢ్: వార్తా పత్రికలు, వార్తా సంస్థల ఉద్యోగ సంఘాల జాతీయ సమాఖ్య రెండు రోజుల సమావేశాలు చండీగఢ్ లో ఈరోజు విజయవంతంగా ముగిసాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్  (ఐజేయూ)   అధ్యక్షుడు కే.  శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన రెండవ రోజు  సమావేశంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం మనుగడకు మీడియా చేస్తున్న కృషిని ప్రశంసించారు. తమ రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు పదివేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. దాన్ని మరో వెయ్యి రూపాయలు పెంచుతామని కూడా సందర్భంగా హామీ ఇచ్చారు. 

 దేశంలో పత్రికా రంగం, జర్నలిస్టులు, ఇతర సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. కార్మిక చట్టాల కోడిఫికేషన్ పేరుతో వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను, వేజ్ బోర్డును రద్దు చేయడాన్ని సమావేశం తీవ్రంగా నిరసించింది. వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. మీడియాకు సంబంధించిన అనేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సమావేశం ఆరోపించింది. వాటిని వెంటనే పునరుద్ధరించకపోతే జర్నలిస్టులు ఇతర పత్రికా సిబ్బంది దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని సమావేశం హెచ్చరించింది. సమావేశంలో ఐజేయు సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, సమాఖ్య అధ్యక్షుడు అనిల్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రుచిక ఎం ఖన్నా, చండీగఢ్, హర్యానా జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు రామ్ సింగ్ బ్రార్, ఏం ఎస్ యాదవ్, పరమానంద పాండే, కలం జోషి, ప్రదీప్ తివారి తదితరులు పాల్గొన్నారు.