పది ఏళ్లలో మోడీ ఏమీ చేయలేడు..

పది ఏళ్లలో మోడీ ఏమీ చేయలేడు..
  • సెంటిమెంట్ డ్రామాడుతున్నాడు మోడీ..
  • హామీలను అమలు చేయకనే కెసిఆర్ ను తెలంగాణ ప్రజలు దించిండ్రు..
  • మిర్చి రైతులకు బీడీలు వేసిన చరిత్ర కెసిఆర్ ది..
  • ఎగ్జిట్ పోల్స్ పై నమ్మకం లేదు..వచ్చేది కాంగ్రెస్ కూటమి..
  • కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు 

ముద్ర ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల : మీడియా ను మోడీ మ్యానేజ్  చేయడంతో  ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని, కానీ దేశ ప్రజలు ఎవరు నమ్మడం లేదు అని,  ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యే విధంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,  మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ.  నరేంద్ర మోడీ పది సంవత్సరాల కాలం ప్రధానమంత్రిగా ఉండి ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని,  ఎన్నికలు రాగానే సెంటిమెంట్తో డ్రామాలు ఆడుతున్నాడని అన్నారు.2019 ఎన్నికల తర్వాత ఉత్తరాఖండ్ వెళ్లి ధ్యానం చేశాడని,  ఈ ఎన్నికల తర్వాత కన్యాకుమారి వెళ్లి వివేకానంద ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం విచిత్రంగా ఉందని అన్నారు.  స్వామి వివేకానంద అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తే,  నరేంద్ర మోడీ మాత్రం హిందువులపై ఎక్కవ ప్రేమ చూపిస్తూ మిగతా  వారిని రెచ్చె పెట్టే విధంగా, మతాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, బ్లాక్ మనీ తెప్పించి,  జనాధన్ అకౌంట్లో 15 లక్షలు వేస్తానని మోసం చేశాడని అన్నారు.  ఢిల్లీలో రైతులు సంవత్సరం పొడుగునా ఉద్యమం చేస్తే కనీసం మద్దతు ధర,  రుణమాఫీ చేయలేదని అన్నారు.అప్పటి ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికల ద్వారా పబ్లిక్ సెక్టార్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉపాధి కల్పించారని,  కానీ నరేంద్ర మోడీ పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం చేశారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను ప్రజలు వద్దనుకొని, కాంగ్రెస్కు పట్టం కట్టారనిఅన్నారు.  దేశ రాజకీయాలు చేస్తానని కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టాడని అప్పటినుంచి కెసిఆర్ ప్రతనం ప్రారంభమైందని అన్నారు.

తెలంగాణలో రైతులు చనిపోతే,  అకాల వర్షాలతో నష్టపోతే ఇక్కడ ఏమి చేయలేదు కానీ,  పంజాబ్ బీహార్ వెళ్లి అక్కడి రైతులకు పైసలు ఇచ్చాడని అన్నారు.  మహారాష్ట్రలో పార్టీ ప్రారంభించి అక్కడి రైతులపై ప్రేమ ఉల్కపోశారని, తెలంగాణ రైతులను మర్చిపోయారని అందుకే రైతులు కాంగ్రెస్కు పట్టం కట్టారని అన్నారు.సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని ఇచ్చిన మాట నిలబెట్టుకుంది అని అన్నారు.  తెలంగాణ కోసం అమరులైన విద్యార్థులకు, నిరుద్యోగులకు కెసిఆర్ ప్రభుత్వం 10 సంవత్సర కాలంలో ఏమి చేయలేదని అన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అందుకే కాంగ్రెస్కు పట్టం కట్టారని,  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు.  ప్రధానమంత్రి మోడీ పది సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు అన్యాయం జరిగిందని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించి రైతుల, ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వస్తే రాహుల్ గాంధీ దేశ ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని,  ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని,  మోడీ వస్తే కార్పొరేట్ సంస్థలకు, దేశంలోని సంపన్నులకే న్యాయం జరుగుతుందని అన్నారు. కొండగట్టు అంజన్న ను దర్శించుకున్నానని ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రార్థించానని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్,  సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.