'ధరణి'లో అక్రమాలు

'ధరణి'లో అక్రమాలు
  • ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి వెబ్ సైట్ ద్వారా భూముల బదలాయింపుల్లో అనేక అక్రమాలు చోటుచేసుకొంటున్నాయి. భూ యజమానులకు తెలియకుండానే ఇతరుల పేరుపై పట్టా చేయడం, ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములు గా మార్చడం జరుగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంపూర్ శివారు సర్వే నంబర్ 16లో పూర్తిగా ప్రభుత్వ భూమి ఉండగా.. ధరణిలో పట్టా భూమిగా రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు.

లింగంపేట మండలం భవానిపేట తండాకు చెందిన ఓ రైతు హైదరాబాద్ కు చెందిన ఒకరికి ఈ భూమిని విక్రయించినట్లు తెలిసింది. ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండానే భూమిని స్థానిక తహశీల్దార్ రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే సర్వే నంబర్ 16 మాత్రం ఖాస్త్ర పహానిలో సర్కారు భూమిగా ఉంది. ధరణిలో పట్టాగా ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలాంటి వెరిఫికేషన్ చేయలేదు. పైగా ప్రభుత్వ భూమిని పట్టా మార్పిడి చేశారు. నిషేధిత జాబితాలో ఉండాల్సిన భూమికి లావాదేవీలు జరగడం గమనార్హం. తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి ఇతనిపై అనేక ఆరోపణలున్నాయి. గతంలో సదరు ఆపరేటర్ ను విధుల నుంచి తప్పించినా రాజకీయ పలుకుబడితో తిరిగి ఇక్కడే విధుల్లో చేరారు. జిల్లా అధికారులు దృష్టి సారించి కార్యాలయంలో విచారణ చేయిస్తే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన లు  వెలుగు చూస్తాయి.