కామారెడ్డి వైద్య కళాశాలలో వంద సీట్లు మంజూరు -సెప్టెంబర్ లో సీట్ల భర్తీ

కామారెడ్డి వైద్య కళాశాలలో వంద సీట్లు మంజూరు  -సెప్టెంబర్ లో సీట్ల భర్తీ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కామారెడ్డి జిల్లా ప్రజలకు జాతీయ వైద్య మండలి శుభవార్త చెప్పింది.  జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటు పై ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, జాతీయ వైద్య మండలి సభ్యులు గత ఏడాదిలో మూడు సార్లు తనిఖీలు నిర్వహించి, ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటులో ఉన్న సాధ్య అసాధ్యాలను పరిశీలించింది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ, సీట్ల భర్తీకి అనుమతి ఇస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు నెలలో నీట్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుండగా, ఆ తరువాత సీట్ల భర్తీలో కామారెడ్డి మెడికల్ కాలేజీలో వంద సీట్ల భర్తీకి అనుమతించారు. ప్రస్తుతానికి జిల్లా కేంద్రంలో ని జిల్లా ఆసుపత్రిలో130 పడకలకు తోడు మరో వంద పడకల ఆసుపత్రి నిర్మించి కళాశాలను ప్రారంభించనున్నారు. దీంతో జిల్లా విద్యార్థులకు వైద్య విద్య చేరువ కానుంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్ర రాజధాని నుంచి 120 కిలోమీటర్ల దూరంలొనే కామారెడ్డి ఉండడంతో ప్రొఫెసర్లు ఇక్కడ పని చేయడానికి ఉత్సుకతతో ఉన్నారు. కేవల రెండున్నర గంటల్లో కామారెడ్డి కి చేరుకుంటారు. అలాగే వైద్య విద్యార్థులకు కూడా దూర భారం తగ్గుతుంది. రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి.