అప్పులు చెల్లించాలంటూ పొలంలో జెండా పాతిన డీసీసీబీ అధికారులు

అప్పులు చెల్లించాలంటూ పొలంలో జెండా పాతిన డీసీసీబీ అధికారులు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు మాసంలో చేస్తామని ప్రకటించగా, మరొవైపు బ్యాంకుల నుంచి అప్పులు పొందిన రైతులు అప్పులు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో కోపరేటివ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటే వాటిని చెల్లించకుంటే ఆ రైతు ఇంటి తలుపులు తొలగించుకొని పోయేవారు. లేకుంటే అప్పులు చెల్లించమని నోటీసులు జారీ జారీ చేస్తారు. ప్రస్తుతం అధికారులు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. బ్యాంకు నుంచి అప్పులు చెల్లించని వారి పొలం వద్దకు వెళ్లి ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పెట్టి అన్నదాతలను వేధింపులకు గురి చేస్తున్నారు.

కామారెడ్డి సహకార కేంద్ర బ్యాంక్ అధికారులు అన్నదాతలపై అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామానికి చెందిన ఓ రైతు బ్యాంకు నుంచి దీర్ఘకాలిక రుణాన్ని పొందారు. పంటలు పండక అప్పుల పాలైన ఆ రైతు తీసుకున్న రుణం చెల్లించడంలో జాప్యం జరుగుతుంది. ఈ వానకాలం పంటలు రాగానే అప్పు చెల్లిస్తానని బ్యాంక్ అధికారులకు ప్రాధేయపడప్పటికీ బ్యాంక్ అధికారులు కనికరించకుండా అన్నదాత పొలం వద్దకు వెళ్లి ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పెట్టి ఈ భూమి యజమాని తమ బ్యాంకు అప్పు ఉన్నాడని, ఈభూమిలో ఎవరు అడుగు పెట్టకూడదు అంటూ ఫ్లెక్సీలు పెట్టి అన్నదాత గౌరవాన్ని సమాజంలో మంట కల్పుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం రుణమాఫీ చేయడం లేదు, మరోవైపుబ్యాంక్ అధికారుల అతి ఉత్సవం పెరిగిపోతుంది.

ఒకవైపు రైతులను రాజులం చేస్తామని గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తున్న పాలకులు, అన్నదాతల రుణాలు చెల్లించమని బ్యాంక్ అదికారులు వేదింపులకు గురి చేసే పాలకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అప్పు చెల్లించకపోవడంతో లింగంపేట్ మండల్ పోల్కంపేట్ గ్రామంలో రైతు పొలంలో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల కామరెడ్డి సహకార బ్యాంక్ అధికారుల తీరుపట్ల సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.