ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి      

ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి      
  • పార్టీకి రాజీనామా చేసిన సుభాష్ రెడ్డి                                                              

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల రెండవ జాబితా ఎల్లారెడ్డి కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టించింది. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పార్టీ అభివృద్ధి కి కృషి చేసిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి  రెండవ సారి    టిక్కెట్ దక్కకపోవడంతో శనివారం నాడు కార్యకర్తల సమక్షంలో బోరున  విలపించారు. ఎల్లారెడ్డి కాంగ్రెస్ టిక్కెట్ మదన్ మోహన్ రావుకు కేటాయించడంతో సుభాష్ రెడ్డి వర్గీయులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.  ఈ మేరకు తన కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించిన సుభాష్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ  గతంలో నల్లమడుగు సురేందర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొంది, టీఆరెస్ లో చేరారని, ప్రస్తుతం మదన్ మోహన్ సైతం ఆలాగే చేస్తారని  ఆరోపించారు. తాను పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని, తనను కాదని, మదన్ మోహన్ కు టిక్కెట్ ఇచ్చారని ఆవేదన చెందారు. తనతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీలు రాజీనామా చేసున్నట్లు వివరించారు. కార్యకర్తల నిర్ణయం మేరకు ఎల్లారెడ్డి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఉన్న జెండాలను తొలగించారు. ఇదిలావుండగా జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు రెండవ జాబితాలో అభ్యర్థులను  ప్రకటించలేదు. త్వరలో మూడవ జాబితాను ప్రకటిస్తారని సమాచారం. కామారెడ్డి నుంచి మాజీమంత్రి షబ్బీర్ అలీ పోటి చేస్తారా లేదా రేవంత్ రెడ్డి పోటీ చేస్తారా తేలాల్సి ఉంది.   బాన్సువాడ నుంచి టిక్కెట్ రేసులో కాసుల బాలరాజు తో పాటు ఓ బీజేపీ నేత, మరో మాజీ ఎమ్మెల్యే రేసులో ఉండగా, జుక్కల్ నుంచి మాజీ ఎమ్మెల్యే గంగారాం, లెష్మికాంత్ రావు ప్రయాత్నాలు చేస్తున్నారు.