అవుట్ పేషంట్ కౌంటర్లను విస్తరించండి

అవుట్ పేషంట్ కౌంటర్లను విస్తరించండి
  • ఎయిమ్స్ అధికారులతో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) రోగుల రద్దీ క్రమేణా పెరుగుతున్న దృష్ట్యా అవుట్ పేషంట్ కౌంటర్లను మరిన్ని పెంచాలని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎయిమ్స్ కార్యనిర్వాహక సంచాలకుడు ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ భాటియాకు సూచించారు. బీబీనగర్ ఎయిమ్స్ ను ఆయన శనివారం శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించారు. ఉదయం పదిన్నర గంటలకు ఎయిమ్స్ కు చేరుకున్న వీరికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా, ఇతర వైద్య అధికారులు స్వాగతం పలికి లోపలికి తీసుకుని పోయారు. తొలుత ఎయిమ్స్ నమూనా చిత్రాన్ని చూపించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిర్మాణాలకు సంబంధించి ప్రతి బ్లాక్ ఎంత మేరకు పని పూర్తయ్యింది, ఇంకా ఎంతమేరకు పెండింగ్ లో వున్నది వివరించారు. తర్వాత ఎంపీ, ఎమ్మెల్యేలను తోడ్కొని వివిధ విభాగాలను చూపించారు. ఎంపీ బ్లడ్ బ్యాంక్, ప్రయోగశాలలు తిరిగి చూశారు. వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి భవనాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తిరిగి చూశారు. వైద్యకళాశాల, పరిపాలన, ఆస్పత్రిలో సేవలను, విద్యార్థుల చదువుల గురించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ వికాస్ బాటియ ను అడిగి తెలుసుకున్నారు. అవుట్ పేషంట్స్ విభాగంలోకి వెళ్లి అక్కడికి వచ్చిన రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.

     అనంతరం ఎయిమ్స్ అధికారులతో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఆస్పత్రి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామీణ ప్రాంతాలకు ఏవిధంగా సేవలను విస్తరిస్తున్నదీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరెక్టర్ వికాస్ భాటియా వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఇంకా అవసరమైన వైద్యసేవలకు సంబంధించి వీలైనంత తొందరలో ఆయా విభాగాలను ప్రారంభింపజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతినెలా తాను ఎయిమ్స్ ను సందర్శిస్తానని, ఇక్కడ లోటుపాట్లు ఏమైనా వుంటే తనకు తెలియజేస్తే, కేంద్రంలో సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే టెక్నికల్, నాన్ టెక్నికల్, దిగువ తరగతి ఉద్యోగాలకు సంబంధించి ఔట్ సోర్సింగ్ ద్వారా చేపట్టే నియామకాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ఔట్ సోర్సింగ్ నియామకాల సమయంలో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆరునెలలలో నిర్మాణాలన్నీ పూర్తయి, అన్ని బ్లాకులు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వికాస్ భాటియా తెలిపారు. ఈ పర్యటనలో ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే, జిల్లా కాంగ్రెస్ నాయకులు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, గోలి పింగళ్ రెడ్డి,  బీబీనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, ఎంపీటీసీ సభ్యుడు గోలి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పంజాల పెంటయ్య గౌడ్, ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా, వైద్యులు శ్యామల అయ్యర్, బిపిన్ వర్ఘీస్, సంగీతా సంపత్ తదితరులు పాల్గొన్నారు.