దేశానికే రోల్ మోడల్ తెలంగాణ

దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
  • ప్రజా భాగస్వామ్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాలలో ముందంజలో నిలిపాం
  •  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు
  • దశాబ్ది ఉత్సవ ప్రసంగంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: తొమ్మిది ఏండ అతి తక్కువ సమయంలోనే సిఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ  దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణా అవిర్బావ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్ల పాతబస్టాండ్ లో తెలంగాణా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని  సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈ రోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని. ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. "తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది" అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ తట్టుకొని తెలంగాణ బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది. సంక్షోభ సమయాలలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని తెలిపారు.

 పండుగలా వ్యవసాయం:

ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే, ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుందని, సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశా నిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ రాష్ట్రాలలోనూ అమలు చేయాలని రైతులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కల్లాల నిర్మాణం, రైతు బంధు సమితుల ఏర్పాటు.. ఒకటా.. రెండా... లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చమన్నారు. సాగుజలాలు, భూగర్భ జలాల లభ్యత పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016 లో ఉన్న 1 లక్షా 77 వేల 960 ఎకరాలలో నికర సాగుభూమి కాస్త 2023 నాటికి  2 లక్షల 40 వేల 430 ఎకరాలకు పెరిగిందని తెలిపారు.రైతుభీమా పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు వివిధ కారణాలతో అకాల మరణం చెందిన 1 803 మంది రైతుల కుటుంబాలకు 90 కోట్ల 15 లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లించామన్నారు.

విద్యుత్ రంగం:  

అన్ని రంగాలకు 24 గంటలతో పాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వెలుగు జిలుగుల రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశ దిశల  వ్యాపించింది. తెలంగాణాలో కరెంటు కోతలు పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి గారు చరిత్ర సృష్టించారని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ బావులకు ప్రతినెల 27 కోట్ల రూపాయలు వెచ్చించి 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జిల్లాలో కేవలం 33/11 కె.వి. సబ్ స్టేషన్లు 43 ఉండగా, తొమ్మిదేండ్లలో  కొత్తగా  33/11 కె.వి. సబ్ స్టేషన్లు మరో  33  ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 132 కె.వి. సబ్ స్టేషన్లు 4 ఉండగా, తొమ్మిదేండ్లలో  కొత్తగా  132 కె.వి. సబ్ స్టేషన్లు  మరో 2 ఏర్పాటు చేశాం. జిల్లాలో 2014 సంవత్సరంలో విద్యుత్ వాడకం 567 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుతం 985 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వాడుతున్నారు. తలసరి విద్యుత్ వినియోగం 2014 లో 885 యూనిట్లు ఉంటే అది 2023 నాటికి 1 వేయి 645 యూనిట్లకు పెరిగిందన్నారు.

మెట్టప్రాంతంలో జలసిరులు:

 జిల్లాలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9, 10, 11, 12 ల ద్వారా 1 లక్షా 39 వేల 246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) ద్వారా 55 వేల 980 ఎకరాలకు, మైనర్, మీడియం ఇరిగేషన్ ద్వారా 57 వేల 146 ఎకరాలకు మొత్తం 2 లక్షల 52 వేల 372 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తో మానేరు నది ఇప్పటికే జీవనదిగా ఆవిర్భవించింది. జలాశయాల నిర్మాణం పూర్తి కావడంతో మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే భూగర్భజల మట్టం గణనీయంగా పెరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ప్యాకేజి-9 మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ ఇటీవలే విజయవంతం అయిందని, దీని ద్వారా వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని 96 వేల 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.

డబుల్ బెడ్ రూం ఇండ్లు:
 స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవనం సాగించేలా అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం  నిర్మిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 3 వేల 443 ఇండ్ల నిర్మాణం పూర్తి చేశాం. తంగళ్ళపల్లి మండలం మండెపల్లి శివారులో సిరిసిల్ల పట్టణ లబ్దిదారులకు 27 ఎకరాల్లో సుమారు 87 కోట్ల 67 లక్షల రూపాయలతో నిర్మించిన 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి  చేతులమీదుగా ప్రారంభించుకున్నమన్నారు. రగుడు, శాంతి నగర్, పెద్దూర్ లో 792 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ దేశానికే సరికొత్త పంథాను నిర్దేశిస్తున్నాయి. సొంత జాగాలో ఇండ్లను నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం తరఫున మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించే “గృహలక్ష్మి”  కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నమన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్.రమేశ్బాబు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి , మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.