ఆగష్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ :  రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి 

ఆగష్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ :  రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి 

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.


గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి, తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానందన వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం పురస్కరించుకొని వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంపిపి, జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారని సభ్యులను అభినందించారు. జిల్లా అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా ఆలేరు బైపాస్ పనులు 40 కోట్లతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పదవి ప్రజల కోసమని, ప్రజల కోసం మనమంతా పనిచేయాలని,  ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా వుండాలని అన్నారు. యాదగిరిగుట్ట సంబంధించి ఆటోల సమస్యలను పరిష్కరించి ఆటోలను గుట్ట పైకి అనుమతించి ఆటో డ్రైవర్లకు జీవన భృతి కల్పించడం జరిగిందని, యాదగిరిగుట్టలో షాపులు పోయినవారికి, భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయడం జరుగుతుందని, యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఇంకా అభివృద్ది చేసి ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని ఆహ్వానించి యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ది పనులను సమీక్షించనున్నట్లు తెలిపారు.

భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫర గురించి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవడం జరిగిందన్నారు. సెప్టెంబరు చివరి లోగా 210 కోట్లతో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లను మిషన్ భగీరథ ద్వారా అందిస్తామని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలలో బస్వాపూర్ పూర్తి చేస్తామని, టెండర్లను పిలవబోతున్నట్లు చెప్పారు. రైతాంగానికి మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో చెప్పిన విధంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. త్రాగునీటి, మురికి కాలువలు సంబంధించి ఏ సమస్య వచ్చినా నాకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ మెసేజీలు పంపినా అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందన్నారు.


ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వానికి స్థానిక సంస్థల ప్రతినిధులు వారథిగా పనిచేశారని, జిల్లా మంత్రి నేతృత్వంలో అందరి భాగస్వామ్యంతో ఇంకా అభివృద్ది పనులు చేసుకుందామన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదవీ కాలం పూర్తి చేసుకొన్న ప్రజాప్రతినిధులందరికీ వారి పదవీ కాలంలో అనేక అభివృద్ది పనులు చేశారని తెలియచేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి శీశైలం, జడ్పిటిసి అనూరాధ, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.