జీ20 దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధం

జీ20 దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధం
  • కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: వ్యవసాయంలో వివిధ రంగాలలో ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి జీ20 దేశాలతో కలిసి పని చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి  నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.  నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన జీ20 వ్యవసాయ మంత్రుల సమావేశం సందర్భంగా గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీ20 సమావేశంలో చర్చల ద్వారా భారతదేశం ఈ సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు, నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తోందని శ్రీ తోమర్ చెప్పారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు అమలు చేయబడ్డాయన్నారు. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కూడా రైతులు ఈ మార్పులను స్వీకరిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు  సేంద్రియ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయని, వీటి అమలు కోసం ఇప్పటివరకు రూ.1500 కోట్లు ఖర్చు చేశాయని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే పంట నష్టాలను తగ్గించేందుకు భారతదేశం వాతావరణాన్ని తట్టుకునే విత్తనాలను అభివృద్ధి చేస్తోందన్నారు. ఇలాంటి వాతావరణ మార్పు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.