ఎన్​కౌంటర్​లో హతమైన హత్య కేసు నిందితుడు

ఎన్​కౌంటర్​లో హతమైన హత్య కేసు నిందితుడు

లక్నో: సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో నిందితుడు విజయ్‌కుమార్ అలియాస్ ఉస్మాన్ చౌదరి సోమవారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. కౌంధియార పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయాగ్‌రాజ్ పోలీసులకు, నిందితుడికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉస్మాన్ చౌదరి హతమైనట్టు ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ తెలిపారు. ఉస్మాన్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చే సరికే అతను మృతిచెందాడని, పరీక్షలు జరిపిన అనంతరం అతను చనిపోయాడని నిర్ధారణకావడంతో పోస్ట్‌మార్టానికి పంపామని ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బద్రి విశాల్ సింగ్ తెలిపారు.

దానికి ముందు, పట్టపగలే ఉమేష్ పాల్‌ను కాల్చిచంపిన మూడు రోజుల తర్వాత (ఫిబ్రవరి 27) నిందితుల్లో ఒకరిని పోలీసులు కాల్చిచంపారు. హతుడిని అర్బాజ్‌గా గుర్తించారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతిఖ్ అహ్మద్ సన్నిహితుడుగా అర్బాజ్‌ను చెబుతారు. ఉమేష్ పాల్ హత్యకు గురైన సమయంలో కారును అర్బాజ్ డ్రైవ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిఖ్ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసును సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని అతిఖ్ అహ్మద్ భార్య షైస్ట పర్వీణ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇటీవల ఒక లేఖ కూడా రాశారు. ఈ హత్యలతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని, అన్ని అనుమానాల నివృత్తికి ఉన్నత స్థాయి విచారణ జరపాలని ఆమె కోరారు. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిఖ్, ఆయన సోదరుడు అష్రాఫ్, ఇద్దరు కుమారులు, భార్య పేర్లను నిందితులుగా చేర్చారు. కాగా, అతిఖ్ ఇద్దరు కుమారుల ప్రాణాలకు ముప్పు ఉందని, అందుకే పర్వీణ్ ఒక లేఖ కూడా రాశారని అతిఖ్ తరఫు న్యాయవాది ఖాన్ సౌలత్ అనీఫ్ చెప్పారు. షైస్ట పర్వీణ్ ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.