అబద్ధపు హామీలతో కేసీఆర్ దేవుళ్లను, భక్తులను మోసం చేస్తుండు..

అబద్ధపు హామీలతో కేసీఆర్ దేవుళ్లను, భక్తులను మోసం చేస్తుండు..
  • కొండగట్టులో ప్రకటించిన కోట్లు వెంటనే విడుదల చేయాలి
  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. అంజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి

కొండగట్టులో రేవంత్ రెడ్డి

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ప్రకటించిన 600 కోట్లు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా కొడిమ్యాల మండలం పూడూర్ లో భస చేసిన ఆయన సోమవారం ఉదయం  కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దర్శనంకు వచ్చారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... అబద్దపు హామీలతో కేసీఆర్ దేవుళ్ళను, భక్తులను మోసం చేస్తుండని విమర్శించారు. కచ్చితమైన ప్రణాళిక లేకుండా.. కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి 100 కోట్లు కేటాయించి, మరోసారి అదనంగా 500, చాలకపోతే 1000 కోట్లు నోటికి ఎంత వస్తే అంత అబద్ధంపు హామీ ఇచ్చి మోసం చేస్తుండన్నారు. తండ్రి బాటలోనే కూతురు నడుస్తుందని, హనుమాన్ చాలీసా కార్యక్రమం చేపట్టిన కవిత కొండపై 125 అడుగుల అంజన్న విగ్రహం ఏర్పాటు చేస్తా అని అబద్దపు హామీ ఇచ్చిందని ఇక్కడ పలువురు తన దృష్టికి తీసుకవచ్చినట్లు తెలిపారు. భక్తి ముసుగులో మరో పార్టీ కూడా అటు దేవుళ్ళను, భక్తులను మోసం చేస్తుందని అన్నారు. 600 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన అంజన్న ఆలయoపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి, భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలన్నారు. కొండ చుట్టూ ఉన్న 800 ఎకరాల ఫారెస్ట్ స్థలంతో గొప్పగా అంజన్న క్షేత్రం అభివృద్ధి చేయొచ్చు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే... కాంగ్రెస్ అధికారంలో వచ్చాక కొండగట్టు అంజన్న క్షేత్రంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. కొండపై పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సిఐ కిశోర్, ఎస్ఐ చిరంజీవిలు బందోబస్త్ ఏర్పాటు చేశారు.


 ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టే యాత్ర...
ప్రజా సమస్యలు తెలుసుకోని,  ప్రభుత్వ వైపల్యాలను ఎండగట్టేoదుకు హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గత నెల 6న ప్రారంభమైన జోడో యాత్రకు మంచి స్పందన ఉండన్నారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో, రాష్టంలో కాంగ్రెస్ రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, అంజనీప్రసాద్ యాదవ్, అడ్లురి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం, స్థానిక కాంగ్రెస్ నాయకులు దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, చారి, ముత్యం శంకర్ గౌడ్, ఎండీ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.


 రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం...
కొండగట్టు అంజన్న దర్శనంకు వచ్చిన రేవంత్ రెడ్డికి ఆలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో 
 అర్చకులు, అధికారులు రేవంత్ రెడ్డికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.  స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ అధికారులు సత్కరించగా, అర్చకులు ఆశీర్వాదించి, తీర్థ ప్రసాదం అందజేశారు. కాగా, రేవంత్ రెడ్డితో సెల్ఫీ దిగడానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పోటీ పడ్డారు. ఆలయ అర్చకులు రేవంత్ రెడ్డితో ఉత్సాహంగా ఫోటోలు దిగారు.


 కొడిమ్యాలలో పర్యటన...
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కొడిమ్యాల మండలంలో పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం మండలంలోని పోతారాం రిజర్వాయర్ సందర్శించిన రేవంత్ రెడ్డిని స్థానికులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. రిజర్వాయర్ సమీపంలో మత్తడిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.