పేపర్ లీకేజీ చర్చ కనుమరుగు చేసేందుకు తెర పైకి బండి సంజయ్ అరెస్ట్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పేపర్ లీకేజీ చర్చ కనుమరుగు చేసేందుకు తెర పైకి బండి సంజయ్ అరెస్ట్.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ చర్చ కనుమరుగు చేసేందుకు బిఆర్ ఎస్  ప్రభుత్వం బండి సంజయ్ అరెస్ట్ డ్రామా తెర పైకి తీసుకువచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ విలేకరులతో మాట్లాడుతూ టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కేటీఆర్ ను విచారించాలని, చైర్మన్ జనార్దన్ రెడ్డిని  భర్తరఫ్ చేస్తే కేటీఆర్ బండారం బయట పడుతుందని అన్నారు. నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలికి తీసేలా ప్రశ్నిస్తే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపనలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేస్తూ, ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, ఇరు పార్టీల మధ్య బేరం కుదిరిందో లేదో అని ఎద్దేవా చేశారు. తెలుగు ప్రశ్నపత్రాన్ని ఉపాధ్యాయుడే వాట్సాప్ ద్వారా లీక్ చేయడం ప్రభుత్వ అసమర్థతకు, అజమాయిషి లేకపోవడానీకి నిదర్శనంగా కనబడుతుంది అన్నారు. రాజకీయంగా ప్రభావితం చేయడంలో సీఎం కేసీఆర్ కన్నా మంత్రి కేటీఆరే శక్తివంతుడనిఅన్నారు. ఈ సమావేశంలో పిసిసి సభ్యుడు గిరి నాగభూషణం, పిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య,  మాజీ కౌన్సిలర్  గాజుల రాజేందర్, పిసిసి ఎన్ఆర్ఐ సెల్ రాష్ట్ర కన్వీనర్ చాంద్ పాషా,  చందా రాధా కిషన్, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడు నేహాల్,పూర్ణ చందర్ రెడ్డి, లైసెట్టి విజయ్ పాల్గొన్నారు.