యూసీసీకీ మద్దతిస్తున్నాం!

యూసీసీకీ మద్దతిస్తున్నాం!
  • పౌరసృతి అమలుతో భారత్‌కు బలం చేకూరుతుంది
  • బీఎస్పీ అధినేత్రి మాయావతి

ఉత్తరప్రదేశ్​: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)కి మద్దతు పలికారు. యూసీసీ భారతీయులందరినీ కలిపి ఉంచుతుందన్నారు. యూసీసీ అమలుతో భారత్‌కు బలం చేకూరుతుందని, ప్రజల్లో సోదర భావం పెరుగుతోందన్నారు. అయితే, బీజేపీ బలవంతంగా ఈ సంస్కరణను చేపట్టేందుకు జరుపుతున్న ప్రయత్నాన్ని మాత్రం మాయావతి తప్పుబట్టారు. ‘యూసీసీ అమలుకు మా పార్టీ వ్యతిరేకం కాదు. అయితే యూసీసీ అమలు చేయడం కోసం బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి మేము మద్దతివ్వం. ఈ అంశాన్ని రాజకీయం చేసి, బలవంతంగా దేశంలో యూసీసీ అమలు చేయాలని బీజేపీ అనుకుంటోంది’ అని మాయావతి తప్పుపట్టారు. యూసీసీ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల సమస్యలు వస్తాయని, నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చుక్కలనంటుతున్న ధరలు, నిరుద్యోగిత, విద్య, ఆరోగ్య వసతులపై దృష్టి సారించాలని సూచించారు. దేశంలోని అనేక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని వాటిపై దృష్టి పెట్టాలని ప్రధానిని ఆమె కోరారు.