జూలై 2న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్

జూలై 2న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్
  • టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ వ్యాప్తంగా జూలై 2న రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీలను నిర్వహించబోతున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పోటీలలో పాల్గొనబోయే యువతి యువకులు ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైతులకున్న  కష్టాలు ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పారు. అప్పట్లో ఖమ్మం జిల్లా రైతులకు బేడీలు వేశారని, ఇప్పుడు భవనగిరి రైతులకు బేడీలు వేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసేవాళ్ళు దేశంలో రైతు రాజ్యం ఎట్లా తెస్తారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులను కలవడానికి వెళ్తే రైతులకు బేడీలు వేయడం దారుణమన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసి , వాళ్ళు రైతులు కాదని బుకాయించడం సమంజసం కాదన్నారు. కొందరు కలెక్టర్లు ధరణి పేరుతో పేదల భూములను స్కామ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధరణి పేరిట భూములను కొల్లగొట్టేది బీఆర్ఎస్ నేతలేనని ఆయన దుయ్యబట్టారు.