కాంగ్రెస్, బీఆర్ఎస్  ఒకతాను ముక్కలే!

కాంగ్రెస్, బీఆర్ఎస్  ఒకతాను ముక్కలే!
  • త్వరలో ఈ రెండు పార్టీలు కలుస్తాయి
  • బీఆర్ఎస్ పై పోరాటానికి హైకమాండ్ గైడ్​లైన్స్ ఇచ్చింది 
  • పదాధికారుల మీటింగ్​లో బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని.. ఎన్నికలకు ముందో, తర్వాతో ఈ రెండూ పార్టీలు కలుస్తాయని బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్​కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, పదాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్​మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్​​రెండూ కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నాయన్నారు. కుటుంబ పాలనను దీటుగా ఎదుర్కోవాలని, జిల్లా, అసెంబ్లీ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ను ఎదుర్కొనే శక్తి బీజేపీకే ఉందని, ప్రజలకు మంచి చేసేది బీజేపీ మాత్రమేనని అన్నారు.

సమగ్ర ప్రణాళికతో ప్రజలవద్దకు..

సమగ్రంగా ప్రణాళిక చేసుకుని వచ్చే 3 నెలలు ప్రజల వద్దకు వెళ్లాలని కిషన్​రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో తేవడానికి నేతలంతా శ్రమించాలని, అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. బీఆర్ఎస్ పై పోరాటానికి హైకమాండ్ కూడా పలు గైడ్ లైన్స్ ఇచ్చిందని తెలిపారు. వరంగల్ లో ప్రధాని మోడీ సైతం బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడారని, వంద రోజుల యాక్షన్ ప్లాన్ ను రూపొందించిందే బీఆర్ఎస్ పై పోరాటానికేనని అన్నారు. కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలకు దిగుతున్నాయని అన్నారు. దీన్ని నేతలంతా దీటుగా ఎదుర్కోవాలని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అవినీతి చేసిందని తెలిపారు. 

ఎక్కడా లేని అవినీతి తెలంగాణలోనే..

దేశంలో ఎక్కడా లేనంత అవినీతి తెలంగాణలో ఉందని కిషన్​రెడ్డి అన్నారు. వేల కోట్ల రూపాయలను బీఆర్‌‌ఎస్ పార్టీ దోచుకుందని, ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి అవినీతి బీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్నారు. గ్రామస్థాయి నుంచి చేరికలు జరగాలని, వచ్చే మూడు నెలలు సమగ్రంగా ప్రణాళిక చేసుకుని ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు, రైతుల సమస్యలు, ధరణి వెబ్​సైట్​, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, నిరుద్యోగులకు చేసిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ వైఫల్యాలను   వివరించాలని, తెలంగాణ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తుశుద్ధి లేదన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో అని కేసీఆర్ ఇపుడు అంటున్నారని, తొమ్మిదేండ్లలలో కేసీఆర్ కు ఎందుకు ఈ జ్ఞానం రాలేదన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ రెండూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎవరు అధికారంలో ఉంటే వారితో దోస్తీ చేసే పార్టీ ఎంఐంఎం అని విమర్శించారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు.