ఈటలకు ఫోన్​ చేయండి.. మంత్రులకు సీఎం కేసీఆర్​ సలహా..!

ఈటలకు ఫోన్​ చేయండి.. మంత్రులకు సీఎం కేసీఆర్​ సలహా..!
  • బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలోకి వెళ్తే మారుతారా అంటూ ప్రశ్న
  • వివాదాల తర్వాత తొలిసారి ఈటల పేరు జపించిన సీఎం
  • మోడీపై పిట్టకథ చెప్పిన  ముఖ్యమంత్రి
  • ఆఖరి రోజు అసెంబ్లీలో నవ్వులు 

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీలో చివరి రోజున సీఎం కేసీఆర్ నవ్వులు పూయించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్​పేరును పదేపదే ప్రస్తావించారు. బీఆర్ఎస్​ నుంచి ఈటల రాజేందర్ ను పంపించిన తర్వాత ఆయన్ను మెచ్చుకోవడం, ఆయన పేరును ప్రస్తావించడం ఇదే తొలిసారి. మంత్రులు కూడా రాజేందరన్న సలహాలు స్వీకరించాలని సూచించారు. దీనిపై ఈటల రాజేందర్​ సైతం స్పందించారు. ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఓ సందర్భంలో సీఎం కేసీఆర్  ‘మిత్రులు రాజేందర్ మాట్లడుతూ అనేక అంశాలను లేవనెత్తారు’ అని వ్యాఖ్యానించారు. ‘హాస్టల్‌లో చదివే పిల్లలకు సన్న బియ్యం అందించాలనే ఆలోచన మా మాజీ సహచరుడు ఈటలదే. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని ఈటల కోరారు. అది న్యాయ సమ్మతమైన కోరిక. మనకు సంస్కారం ఉంది. రాజేందర్ చెప్పారు కాబట్టి చేయొద్దు అనొద్దు. వెంటనే చార్జీలు పెంచుతూ వెంటనే జీఓ జారీ చేయండి’ అని  కేసీఆర్ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. కావాలంటే ఈటలకు ఫోన్ చేయాలని,  డైట్ ఛార్జీల పెంపు విషయంలో ఆయన సలహాలు కూడా తీసుకోవాలని సూచించారు. తమకు ఎలాంటి బేషజాలు లేవని, తమకు ఎవరు మంచి సలహాలు, సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. ‘మా ఈటల రాజేందర్’ అంటూ గతంలో మాదిరిగా ఆత్మీయంగా మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలు రాజేందర్ కు తెలుసని, బీఆర్​ఎస్​ నుంచి బీజేపీలోకి వెళ్తే అన్ని విషయాలు మరిచిపోతారా అంటూ ప్రశ్నించారు. గత కొన్ని రోజులుగా సందు దొరికితే చాలు మా రాజేందరన్న మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నాడన్నారు.  సీఎం కేసీఆర్ పదే పదే తన పేరును ప్రస్తావించడం పట్ల ఈటల స్పందించారు. తన ఇమేజీ డ్యామేజ్ చేసే ఉద్దేశంతోనే అని ఆరోపించారు. 

మోడీపై పిట్టకథ
దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సి ఉన్నా అలా జరగడం లేదని, ప్రధాని మోడీకి వాస్తవాలు చెప్పకుండా పొగడ్తలతో సరిపెడుతున్నారని, ఆయన కూడా వాటిని విని మురిసిపోతున్నారని సెటైర్ వేశారు. అన్నీ తెలిసే సమయానికి మోడీ మాజీ ప్రధాని అయిపోతారంటూ కేసీఆర్ ఓ పిట్ట కథ చెప్పుకొచ్చారు. ‘తిరుమల రాయుడనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒకటే కన్ను ఉండేది. ఆ విషయంలో ఆయన ఎప్పుడూ బాధపడుతుండేవాడు. అదే రాజ్యంలో ఒక కవి ఉండేవాడు. ఆయన పేదవాడు. రాజుగారి దగ్గర ఏదైన సహాయం పొందాలనుకుంటాడు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయనను బాగా పొగడాలని అందరూ సలహా ఇస్తారు. దాంతో ఆ కవి ఇష్టం లేకపోయినా రాజును పొగుడుతూ,‘అన్నాతి గూడ హరుడవు.. అన్నాతిని గూడనపుడసుర గురుడవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెబుతాడు అంటూ కేసీఆర్ ఆ కథ అర్థం వివరించారు. భార్యతో ఉన్నప్పుడు నువ్వు శివుడివి. భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. ఒక్క కన్ను లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా, ధృతరాష్ట్రుడంతటి వాడివి’ అని పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రధాని మోడీని కూడా ఇలాగే పొగుడుతున్నారంటూ కేసీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.