తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం - ఢిల్లీలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం - ఢిల్లీలో మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం

ముద్ర ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచానికి చాటేలా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుని అమరులకు అభివృద్ధి అసలైన నివాళి మాత్రమే అనే తీరుగా మా ప్రభుత్వం పని చేస్తుంది అని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఐటి, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. 9 సంవత్సరాలలో హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా అందింది గుండు సున్న, హైదరాబాద్ లాంటి నగరంలో స్కై వేల నిర్మాణం కోసం అనేక సార్లు విజ్ఞప్తి చేశామన్నారు. రక్షణ శాఖ మంత్రులు మారుతున్నా, కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మారలేదు అని ఆయన అన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రధాన మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదు, జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వరకు ఒక స్కై వే నిర్మాణం… పారడైజ్ చౌరస్తా నుంచి మేడ్చేల్ ఓఆర్ఆర్ వరకి మరో స్కై వే నిర్మాణం… వీటికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలని అనేకసార్లు విజ్ఞప్తి చేశాం ఈ సారి మరోసారి ఈ విషయాన్ని రాజ్ నాద్ సింగ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. 

రక్షణ శాఖ నుంచి రాజీవ్ రహదారి వైపు స్కై వేల నిర్మాణం కోసం 96 ఎకరాల భూమి ,మేడ్చల్ వైపు మరో 56 ఎకరాల  భూమి ఇస్తే అంతే విలువ కలిగిన భూమిని ఇస్తామని చెప్పినా స్పందన లేదన్నారు. స్కై వేల మాదిరే స్కై వాక్ ల నిర్మాణాన్ని కూడా చేస్తున్నాం,  ఉప్పల్ లో చేపట్టింది స్కై వాక్ పూర్తయిందన్నారు. కానీ రక్షణ శాఖ పరిమితుల వలన మెహదీపట్నంలో ప్రారంభించిన ప్రాజెక్టు ఆగిపోయింది..  గోల్కొండ, ఇబ్రహీం భాగ్  లింకు రోడ్ల కోసం అవసరమైన రక్షణ భూమిని కూడా అడిగామన్నారు. ;

కంటోన్మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జిహెచ్ఎంసికి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాల్ లను నిర్మాణం చేస్తామని కోరామన్నారు. మా వైపు నుంచి ప్రయత్న లోపం  లేకుండా గత పది సంవత్సరాలుగా ఈ అంశాలను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  ఈసారి అయినా  సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. రేపు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుస్తున్నాము అని చెప్పారు. లక్డికపూల్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో కోసం విజ్ఞప్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే అనేకసార్లు ఈ అంశంలో డిపిఆర్లు ఇచ్చామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. ఎస్ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసాము కానీ రసూల్ పురా వద్ద మూడు నాలుగు ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు పూర్తి అవుతుంది అన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేదు. ఈ విషయంలో ఆమిత్ షాను  కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. 

హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు  కేంద్రం కలిసి రావాలి..  పటాన్ చెర్వు  నుంచి హయత్ నగర్ దాకా మెట్రో విస్తరణ కూడా కేంద్రం కలిసి రావాలి.. తొమ్మిది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం తెలంగాణకు సహకరించలేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని కొనసాగిస్తుందని అనిపిస్తుందన్నారు. ఒకవేళ కేంద్రం తన వైఖరి మార్చుకోకుంటే ప్రజల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు.

కిషన్ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెలవదు కానీ కిషన్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్ లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా  చూపించారు. ఉత్తర ప్రదేశ్ లో సుమారు 10 చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వము, హైదరాబాద్లో ఎందుకు మెట్రోకి సహకరించాలడం లేదోతెలపాలన్నారు. హైదరాబాద్ లో వరదలు వస్తే సహకరించని కేంద్రం, గుజరాత్ లేదా ఇతర బిజెపి రాష్ట్రాల్లో వరదలు వస్తే ఎందుకు నిధులిచ్చిందో కిషన్ రెడ్డి చెప్పాలి. నిస్సహాయంగా ఉన్న కిషన్ రెడ్డిని కంటే పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము ఇవ్వగలం. తెలంగాణ రాష్ట్రం బీజేపీ పాలిత పేద రాష్ట్రాల అభివృద్ధిలోనూ తెలంగాణ రాష్ట్ర నిధులు ఉన్నాయన్నారు. ఈ విధంగా జాతి నిర్మాణంలో తెలంగాణ సహాయకారిగా ఉన్నందుకు బిజెపి నేతలు  తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాలన్నారు. 

 
ప్రధానమంత్రి మోడీకి అవకాశం ఇస్తే ఢిల్లీని కూడా తీసుకెళ్లి గుజరాత్ లో పెడతాడు. రేపు ప్రజలు ఏకం చేసే అంశాన్ని నమ్ముతాం కానీ రాజకీయ పార్టీలు ఏకం చేసే అంశాన్ని కాదు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ మరియు  భారతీయ జనతా పార్టీలు ఘోరంగా విఫలం అయ్యాయి . ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదే. ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల్లో ఐకమత్యం రావాల్సిన అవసరం ఉన్నది. అంశాల వారీగా ఈ రెండు పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసే  ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని, నమూనాను దేశవ్యాప్తంగా  అమలు చేయాలనుకుంటున్నామన్నారు. 

నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బిజెపి కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసు. ఎవరు ఎవరితో కుమక్కు అవుతున్నారో ప్రజలకు తెలుసు. దేశంలో ఎప్పటిదాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లోకెల్లా అత్యంత బలహీనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ బలహీనతలను దేశంలో అందరికంటే ఎక్కువగా విమర్శించింది భారత రాష్ట్ర సమితినే. సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్రం.. ఎ నిర్ణయం తీసుకున్నా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాము. ఢిల్లీలో తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ అర్దినెన్సును పార్లమెంట్లో అందుకు వ్యతిరేకంగా నిలబడతాం. సమైక్య స్ఫూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్ను కాంగ్రెస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేసారు