ప్రతి జిల్లాలో దశాబ్ధి వనాలు

ప్రతి జిల్లాలో దశాబ్ధి వనాలు
  • 19న హరిత ఉత్సవం
  • హరితహారం కోసం పనిచేసిన వారికి అవార్డులు, సత్కారాలు
  • సీఎంవో హరితహారం ప్రత్యేక అధికారి ప్రియంకా వర్గీస్

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 19న నిర్వహించనున్న హరిత ఉత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో రెండు మూడు ఎకరాల విస్తీర్ణంలో దశాబ్ధి వనాలను ఏర్పాటు చేయనున్నట్లు  సీఎంవో హరితహారం ప్రత్యేక అధికారి ప్రియంకా వర్గీస్ తెలిపారు. ప్రతి పంచాయతీ, మున్సిపల్ ప్రాంతాల్లో మొక్కలను విరివిగా నాటుతామన్నారు. హరితహారం విజయవంతం కావడానికి కష్టపడిన వారిని గుర్తించి సత్కరించి, అవార్డులను ప్రదానం చేస్తామని ఆమె వెల్లడించారు. పచ్చదనం పెంపుపట్ల ప్రజల్లో అవగాహన కల్పించామని, 85 శాతం మొక్కలు బతకాలనే లక్ష్యంతో స్థానిక సంస్థల చట్టాల్లో ప్రభుత్వం మార్పులు చేసిందని తెలిపారు. వానలు వాపస్ రావాలనే ఉద్దేశ్యంతో హరితహారంలో భాగంగా సూక్ష్మస్థాయిలో మొక్కలను పెంచడం వలన 7 ఏళ్ళగా వానలు విస్తారంగా పడుతున్నాయని పేర్కొన్నారు. గతంలో అటవీశాఖ మాత్రమే మొక్కలను పెంచే బాధ్యత తీసుకునేదని, ఇప్పడు హరితహారంలో అన్ని శాఖలు, ప్రజలు భాగస్వామ్యమయ్యారని తెలిపారు. రహదార్ల వెంబడి మొక్కలను పెంచడం, అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడం, నర్సరీలలో మొక్కలను పెంచడం, ఖాళీ స్థలాల్లో మొక్కలను నాటడం వంటి కార్యక్రమాలతో తెలంగాణలో 7.7 శాతం గ్రీనరీ పెరిగినట్లు పారెస్టు సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు వెల్లడించాయన్నారు. తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేశారని ఆమె పేర్కొన్నారు.