8మంది భారత ఖైదీలకు ఉరి

8మంది భారత ఖైదీలకు ఉరి
  • ఖతార్​ తీవ్ర నిర్ణయం
  • విచారం వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
  • న్యాయప్రక్రియతో ముందుకు వెళతామన్న భారత్​

న్యూఢిల్లీ: ఎనిమిది మంది భారతీయ ఖైదీలకు ఖతార్​ ఉరిశిక్ష విధిస్తూ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిది నెలల క్రితం గూడచర్యం ఆరోపణలపై 8 మంది భారతీయ నేవీ అధికారులను ఖతార్​లో అరెస్టు చేశారు. వీరంతా ఇజ్రాయెల్​కు అనుకూలంగా గూడచర్యం చేశారని ఆరోపణలు చేస్తూ అరెస్టు చేసింది. కాగా భారతీయుల మరణశిక్షపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. తీవ్ర విచారం, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై తాము న్యాయబద్ధ ప్రక్రియపై ముందుకు వెళతామని ప్రకటించింది. బాధితుల విడుదలకు అన్ని రకాలైన ప్రక్రియలతో తోడ్పాటునందిస్తామంది. అదే సమయంలో ఖతార్​తో కూడా చర్చలు జరుపుతామన్నారు. న్యాయ ప్రక్రియతో కూడుకొని ఉన్న అంశం కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడలేమని విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా మరణశిక్ష విధించిన భారతీయులంతా పలు యుద్ధనౌకలకు నాయకత్వం వహించారు. దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు. ఇది ఒక ప్రైవేట్ సంస్థ, ఇది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందిస్తుంది. కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్. గూఢచర్యం ఆరోపణలపై విచారణ కోసం వారందరినీ వారి స్థానిక నివాసం నుంచి అరెస్టు చేశారు. అరెస్టులపై అనేకసార్లు వీరు వేసిన బెయిల్​ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అరెస్టు అయిన వారిలో రాష్ర్టపతి చేత సన్మానించబడ్డ కమాండర్​ తివారీ కూడా ఉండడం విశేషం. ఈయన్ను రామ్​నాథ్​ కోవింద్​ అత్యుత్తమ సేవల నిర్వహణకై సన్మానించారు. కాగా ఇజ్రాయెల్​కు భారత్​ మద్దతు కారణం కూడా ఖతార్​ ఆగ్రహానికి ఒక కారణంగా పలువురు భావిస్తున్నారు. మరోవైపు ఎకనామిక్​ కారిడార్​లో ఇజ్రాయెల్​ పాత్రపై కూడా భారత్​ కీర్తించడం, ఇజ్రాయెల్​తో భారీ వ్యాపార వ్యూహాల్లో పాలు పంచుకుంటుండడం కూడా ఖతార్​కు నచ్చనట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.