చీతాల మనుగడ భారత్​లో కష్టమే?!

చీతాల మనుగడ భారత్​లో కష్టమే?!

ముద్ర సెంట్రల్​ డెస్క్​: భారత్‌లో 1952లో అంతరించిపోయాయని ప్రకటించిన చీతాలు చాలా కాలం తరువాత ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ‘ప్రాజెక్ట్​– చీతా’ పేరుతో నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుంచి 8 మధ్యప్రదేశ్‌లో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో వదిలారు. అనంతరం మరో 12 చీతాలు దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి భారత్​కు తీసుకువచ్చారు. 70 ఏళ్ల క్రితం చీతాల జాతి అంతరించిపోయిందని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అటుపిమ్మట చీతాల మనుగడకు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకున్నా ఎందుకో చిరుతలకు ఈ వాతావరణం పొసగక, తమలో తామే ఆధిపత్యపోరాటం కోసమో పోరాడుతూ గాయాలపాలవుతూ మృతి చెందుతున్నాయి. ఎన్​క్లోజర్​లలో ఉన్నంత కాలం బాగానే ఉన్నా, వాటిని పార్కు అడవిలోకి వదిలాక ఆధిపత్య ఈ చిరుతలు ఆధిపత్య పోరాటాన్ని కొనసాగించాయి. ఈ నేపథ్యంలోనే మూడు చిరుతలు మృతిచెందగా, మరో రెండు చిరుతలు గుండెపోటు (కార్డియాక్​ అరెస్టు)తో మృతిచెందాయి. 

స్వాతంత్య్రనంతరం చీతాలు మటుమాయం
చీతాల గరిష్ట వేగం 70 కిలోమీటర్లు. ప్రపంచవ్యాప్తంగా 7000 చీతాలుండగా అత్యధికంగా దక్షిణాఫ్రికా, నమీబియా అడవుల్లోనే దాదాపు మూడొంతుల చీతాలు ఉన్నాయి. మొఘల్​ చక్రవర్తి జాహంగీర్​ (1556‌‌–1605), అక్బర్​ల కాలంలో సుమారు పదివేల చీతాలు ఉండేవని అంతేగాక ఆ రోజుల్లో వీటిని చాలామంది పెంపుడు జంతువుగా కూడా పెంచుకునేవారని చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో రాజులు  చీతాలను పెంచుకోవడం గొప్పగా భావించేవారు. కాలక్రమేణా రాజుల కాలం అంతరించడం, స్వాతంత్య్రనంతర పరిణామాల నేపథ్యంలో వేటగాళ్లకు అడ్డూ అదుపు లేకపోవడంతో ఆ సంఖ్య కాస్త తగ్గిపోయింది. కాలక్రమేణా చీతాలు మటుమాయమైపోయాయి. దీంతో చీతాలను భారత ప్రభుత్వం అంతరించిపోయిన జాతిగా ప్రకటించింది.

ప్రాజెక్టు చీతా..
జాతీయ అటవీశాఖ, కేంద్రం ఆధ్వర్యంలో ప్రధాని నేతృత్వంలో ఆయన జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్ట్​చీతా’ పేరుతో వీటిని మళ్లీ భారత్​లోకి తీసుకురావడంలో సఫలమయ్యారు.  వీటితోపాటు వన్యప్రాణ నిపుణులు, పశువైద్య నిపుణులు, బయాలజిస్టులతో కూడిన బృందం చీతాల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోయింగ్​ 747 విమానంలో వీటిని భారత్​కు తీసుకువచ్చి ఎంపీలోని కునోలో వదిలారు. వీటి మనుగడ, క్షేమం కోసం ఓ డిపార్టుమెంట్​నే ఏర్పాటు చేసి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అయినా ఇప్పటికే మూడు పిల్ల చీతాలు, ఐదు పెద్ద చీతాలు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కునోలో 16 చిరుతలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వరుస చీతాల మృతివల్ల వీటి భద్రతపై కూడా అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. 

అంతరించేందుకు కారణం..
చీతాలకు పరుగెత్తే స్వభావం ఎక్కువే అయినప్పటికీ పోరాట స్వభావం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న చిన్న గాయాలైనా వీటి మృతికి కారణమవుతాయంటున్నారు. మరోవైపు ప్రాంతాల ఆధిపత్య పోరాటం వల్ల కూడా పెద్దపులులు, దుప్పులు, దున్నపోతుల దాడుల్లో కూడా చీతాలు చనిపోయి వీటి జాతులు అంతరించిపోయినట్లు చెబుతున్నారు. అందువల్లనే ఇవి భారత్​లో మనుగడ సాగించలేకపోతున్నాయన్నారు. పెరుగుతున్న జనాభా కారణంగా, అటవీ విస్తీర్ణాలు తగ్గడం కూడా చీతాలు అంతరించిపోవడానికి మరోకారణంగా వెల్లడిస్తున్నారు. 

చీతాల వరుస మరణాలు
మార్చి 27న సాశా, ఏప్రిల్​ 23న ఉదయ్​, మే 9న దక్ష, మే 25న మరో రెండు చీతాలు, జూలై11న ఒకటి, జ్వాల అనే చీతాకు పుట్టిన చీతాలు రెండు చనిపోవడం గమనార్హం. వీటి మృతికి అనారోగ్య, వాతావరణ మార్పులు, ఆధిపత్య పోరే కారణాలుగా అధికారులు చెబుతున్నారు.