ఓవైసీ చేతిలోనే కేసీఆర్ స్టీరింగ్
- తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్నది ఎంఐఎం
- తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లలో తెలంగాణ కు కేసీఆర్ ఏమీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నానని విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆదివాసుల కోసం గిరిజన యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డులను ఏర్పాటు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు.
పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది ఏమీ లేదని, అంతా కొడుకు కూతురు కోసమే చేశారని ఆయన విమర్శించారు. కాశ్మీర్ లో 379 యాక్ట్ రద్దు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ.. రాహుల్ బాబా కొత్త విషంతో వస్తున్నారని ప్రజలు నమ్మొద్దని పిలుపునిచ్చారు. యూపీఏ ప్రభుత్వంలో ఆదివాసులకు రూ.24 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రూ.124 వేల కోట్లు బడ్జెట్ కేటాయించారని వివరించారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతిగా చేసి గౌరవం ఇచ్చామని ఆయన చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఏ మొఖం పెట్టుకుని ఈ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆయన కోరారు.