బిజెపిలో చేరాక నో ఈడీ.... నో టెన్షన్

బిజెపిలో చేరాక నో ఈడీ.... నో టెన్షన్

సిగ్గు విడిచి చెప్పిన ఎంపీ

ముంబాయి: 'నేను బిజెపి ఎంపీని... ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నా జోలికి రాదు. బిజెపిలో చేరిన తర్వాత  మస్తుగా ఉంది. సుఖూన్ గా నిద్రపోతున్నా... నాకు ఈడీ  అంటే భయం లేదు'. మహారాష్ట్రలోని సాంగ్లీ  పార్లమెంట్ సభ్యుడు సంజయ్ కాకా పాటిల్ నిస్సిగ్గుగా, బాహాటంగా ఓ సభలో  చెప్పిన మాట ఇది. దీన్నిబట్టి బిజెపి ఈడిని ఏ విధంగా వాడుకుంటున్నదో స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి మహారాష్ట్ర విధానమండలి సభ్యుడుగా ఉన్న సంజయ్ పార్టీ మరో ఎన్నికల్లో  ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆ తర్వాత ఆయన 2014లో బిజెపిలో చేరి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న సంజయ్ పాటిల్ తన రాజకీయ జీవితం తొలి నాళ్లలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. నిర్మోహమాటంగా మనసులో ఉన్నది చెప్పడం పాటిల్ అలవాటు పాపం. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో పెట్టి బిజెపి ఈడిని ఎంతగా దుర్వినియోగం చేస్తున్నదో చెప్పడానికి పాటిల్ స్టేట్ మెంట్ చాలునని వ్యాఖ్యానించారు.