రహదారుల విస్తరణలో 59 శాతం వృద్ధి

రహదారుల విస్తరణలో 59 శాతం వృద్ధి


ఢిల్లీ: గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా భారతదేశ రోడ్ నెట్‌వర్క్ 59 శాతం వృద్ధి చెంది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా మారిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం తెలిపారు. భారతదేశ రహదారి నెట్‌వర్క్ 2013–-14లో 91,287 కి.మీలండగా, ప్రస్తుతం 1,45,240 కి.మీలకు పెంచామన్నారు. రోడ్ల పెరుగుదలతో ఆయా రాష్ర్టాల కనెక్టివిటీని సులువు చేశామన్నారు. దీని వల్ల వ్యాపార రంగం పుంజుకుందన్నారు. రోడ్ల కనెక్టివిటీ మెరుగుచేయడం వల్ల అనేక ప్రాంతాల్లోని వేగంగా ఫలితాలను అందుకోగలుగుతున్నారన్నారు. ట్రాన్స్​పోర్టేషన్​ రంగంలో భారీ వృద్ధి నమోదవుతుందన్నారు. 2013–14లో రూ. 4770 కోట్లుగా ఉన్న టోల్​ఆదాయం, ప్రస్తుతం రూ. 41,342 కోట్లకు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని రానున్న కాలంలో రూ. 1,30,000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో మరిన్ని ప్రాంతాలకు రోడ్ల విస్తరణ చేపడుతున్నామని గడ్కరీ స్పష్టం చేశారు. టోల్​ప్లాజాల వద్ద అత్యాధునిక సాంకేతికతను వినియోగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనివల్ల టోల్​ల వద్ద రద్దీ సమస్యను పూర్తిగా అరికడతామన్నారు. ఉన్న రహదారులను పెంచడం, కొత్త రహదారులను నిర్మించడం, ఆయా చోట్ల బైపాస్​లు, అండర్​పాస్​ల నిర్మాణం కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటికే చాలాచోట్ల పనులు పూర్తయ్యాయని, మరిన్ని చోట్ల పనులు పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నామని గడ్కరీ స్పష్టం చేశారు.