పాలక్కాడ్ లో పూర్తయిన ప్రభాకరన్ అంత్యక్రియలు

పాలక్కాడ్ లో పూర్తయిన ప్రభాకరన్ అంత్యక్రియలు

పాలక్కడ్: కేరళలోని పాలక పాలక్కాడ్ లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జే యూ) ఉపాధ్యక్షుడు జి ప్రభాకరన్ భౌతిక కాయానికి సోమవారం నాడు అంత్యక్రియలు జరిగాయి.

ఐజే యూ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూ జే) ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ పాలక్కాడ్ వెళ్లి  ప్రభాకరన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తమ ఉద్యమ సహచరునికి వారు ఘనంగా నివాళులు అర్పించారు. కేరళ విద్యుత్ శాఖ మంత్రి కృష్ణన్ కుట్టి, ఎంపీ శ్రీకందన్, మాజీ మంత్రి ఇస్మాయిల్, పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ చిత్ర, సిపిఐ రాష్ట్ర నాయకులు చామున్ని, అజయన్, సురేష్ రాజ్, బిజెపి రాష్ట్ర నాయకుడు కృష్ణదాస్, కైరాలి టీవీ డైరెక్టర్ టీ ఆర్ అజయన్, కేరళ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సురేంద్రన్, కవితా భామ, రితేష్, సురేష్ బాబు, నాసర్, షబ్బీర్, జాబ్ జాన్, రజిత తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. 

 సంతాప సభ 
అనంతరం జరిగిన సంతాప సభలో పలువురు వక్తలు జర్నలిస్టు ఉద్యమానికి ప్రభాకర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలోనూ జాతీయస్థాయిలోనూ జర్నలిస్టు ఉద్యమానికి ప్రభాకరన్ గత మూడున్నర దశాబ్దాలలో విశేషమైన సేవలు అందించారని అన్నారు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలలో వృత్తిపరంగా రాణించిన ప్రభాకరన్ ప్రజల సమస్యలను ప్రతిబింబించారని పేర్కొన్నారు.