భారత పురోగతిలో 'మహిళా శక్తి' కీలకం

భారత పురోగతిలో 'మహిళా శక్తి' కీలకం

శక్తివంతమైన దేశంగా భారత పురోగతిలో మహిళా శక్తి  కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  ప్రశంసించారు. నేడు భారతదేశ సామర్థ్యం కొత్త దృక్కోణం నుంచి ఆవిర్భవించిందని, ఇందులో మహిళా శక్తి పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ఆదివారం  ''మన్ కీ బాత్''  99వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు. 'మన్ కీ బాత్' ఈ ఏడాదిలో ఇది మూడవది. 2014 అక్టోబర్ 3వ తేదీ విజయదశమినాడు మోదీ తొలి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ మొదలైంది. రాబోయే ఏప్రిల్ 30న 'మన్ కీ బాత్' నూరవ మైలురాయికి చేరుకోనుంది. 100వ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ సూచనలను అందించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు.  మహిళా శక్తి ప్రాధాన్యతను ప్రధాని ప్రస్తావిస్తూ, నాగాలాండ్‌లో 75 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా మహిళా శాసనసభ్యులు విధానసభకు చేరుకున్నారని, ఆసియా తొలి మహిళా లోకో పైలట్‌గా సురేఖా యాదవ్ మరో రికార్డు సృష్టించారని అన్నారు. వందే భారత్ తొలి మహిళా పైలట్‌గా ఆమె గుర్తింపు పొందారని ప్రశంసించారు.

కంబాట్ యూనిట్‌లో కమాండ్ అపాయింట్‌మెంట్ ద్వారా వైమానిక దళ తొలి మహిళా అధికారిగా గ్రూప్ కెప్టెన్ శైలజా థామి పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ సియాచిన్‌లో మోహరించిన తొలి మహిళా అధికారిణిగా నిలిచారని చెప్పారు. ది 'ఎలిఫెంట్ విస్పరర్స్' అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు తేవడం ద్వారా నిర్మాత గునీత్ మోంగా, దర్శకులు కార్తికి గోంజాల్వెస్ దేశానికి ప్రశంసలు తెచ్చారని అన్నారు. ఐక్యరాజ్యసమితి  కింద శాంతి పరిరక్షణలో మహిళా ప్లాటూన్‌ను భారత్ మోహరించిందని, మహిళలకు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారని కొనియాడారు. పండుగల సందర్భంగా దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. పండుగలు ఉత్సాహంగా జరుపుకోండని, అయితే అప్రమత్తంగా ఉండండని ప్రజలను కోరారు. దేశంలో అవయవదానంపై అవగాహన పెరుగుతోందని తెలిపారు. ఒక వ్యక్తి మరణాంతరం అవయవదానం చేస్తే అది ఎనిమిది, తొమ్మిది మందికి కొత్త జీవితాన్ని అందిస్తుందని, వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. 2013లో దేశంలో 5,000 కంటే తక్కువగా ఉన్న అవయవ దానం కేసులు, 2022 నాటికి అది 15,000 కంటే ఎక్కువగా పెరిగిందన్నారు. ఇది సంతృప్తి కలిగించే విషయమని తెలిపారు.